గిరిజనులకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలి…
సాంకేతిక సేవలను ప్రజలకు చేరవేయాలి….
–పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల జోన్‌లోని మాదారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు మంచిర్యాల జోన్ డీసీపీ ఎ.భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్,తాండూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దేవయ్య,ఎస్‌ఐ సౌజన్య పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.అనంతరం సాయుధ దళ పోలీసుల గౌరవ వందనాన్ని పోలీస్ కమిషనర్ స్వీకరించారు.
తదనంతరం స్టేషన్ పరిసరాలు,వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, పోలీస్ స్టేషన్ ఆవరణలోని క్రీడా ప్రాంగణం, పోలీస్ వాహనాల నిర్వహణను పరిశీలించారు. ప్రతి పోలీస్ వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రాగన్ లైట్, తాళ్లు, ట్రాఫిక్ కోన్స్, క్రైమ్ ప్రొటెక్షన్ రిబ్బన్, రైట్ గేర్ కిట్ (హెల్మెట్, స్టోన్ గార్డ్, లాఠీ, బాడీ ప్రొటెక్టర్) తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం అందినప్పుడు కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తత, స్పందన తీరు ఎలా ఉందో కమ్యూనికేషన్ సెట్ ద్వారా మాట్లాడి తెలుసుకున్నారు.స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ సంబందించిన పూర్తి రికార్డ్స్ ,పెండింగ్ కేసులు ,తదితర వివరాలను ఎస్‌ఐ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే సిబ్బందితో మాట్లాడి వారి విధులు, ఎదురవుతున్న సమస్యల గురించి ఆరా తీశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, విస్తారమైన గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు సేవలందిస్తున్న మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు మరింత స్నేహపూర్వకంగా, అందుబాటులో ఉండే పోలీసింగ్ అందించాలని సూచించారు.
గిరిజనులతో సున్నితంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను అర్థం చేసుకుని విశ్వాసాన్ని పెంపొందించాలని ఎస్‌ఐ, సీఐలకు ఆదేశించారు. పోలీస్ శాఖలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక సేవలు, సీసీటీఎన్‌ఎస్,హాక్ ఐ, టీఎస్ కాప్ వంటి యాప్‌లను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
అలాగే పాస్‌పోర్ట్ ధృవీకరణ, వివిధ ధ్రువపత్రాల జారీ,ఫిర్యాదుల స్వీకరణ వంటి ఆన్‌లైన్ సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మహిళల భద్రత, చిన్నారుల రక్షణకు చేపడుతున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను అత్యంత ప్రాధాన్యంతో అమలు చేయాలని సూచించారు.
గంజాయి,ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు,యువత, తల్లిదండ్రులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు,వాటి ప్రయోజనాలు, ప్రాముఖ్యత,సైబర్ నేరాల నివారణ, రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.
స్టేషన్ ఎస్‌ఐలు తమ పరిధిలో విజిబుల్ పోలీసింగ్,పెట్రోలింగ్, ఆకస్మిక వాహన తనిఖీలు నిరంతరం నిర్వహించి నేరాల నియంత్రణతో పాటు ముందస్తు సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. భారీ వర్షాలు,ప్రకృతి వైపరీత్యాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక (ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్) సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.
మాదారం పోలీస్ స్టేషన్ నిర్వహణ, సౌకర్యాలు,పనితీరు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ ఎస్‌ఐ, సీఐతో పాటు స్టేషన్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

