బాలల రక్షణే లక్ష్యం.. 278 మంది చిన్నారులకు భద్రత కల్పించిన పోలీసులు….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు ప్రతి చిన్నారికి సురక్షితమైన బాల్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా చేపట్టిన ‘ముస్కాన్–12’ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినట్లు రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించే ఈ కార్యక్రమాల ద్వారా తప్పిపోయిన, వదిలివేయబడిన, బాల కార్మికులుగా పనిచేస్తున్న చిన్నారులను గుర్తించి రక్షించడం, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి అప్పగించడం లేదా అవసరమైతే బాలల సంరక్షణ గృహాలకు తరలించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
జూలై 1 నుంచి 31 వరకు కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 278 మంది బాలబాలికలను గుర్తించి రక్షించారు. ఇందుకోసం ప్రతి విభాగంలో ఒక ఉప నిరీక్షకుడు, నలుగురు పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, బాలల సంక్షేమ కమిటీ, కార్మిక శాఖ, విద్యాశాఖ, బాలల సంరక్షణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా పరిధిలో 151 మంది బాలలను రక్షించి, 11 కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా పరిధిలో 127 మంది బాలలను రక్షించి, 6 కేసులు నమోదు చేసి 7 మందిని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ, బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి పౌరుడు బాధ్యతతో సహకరించాలని పిలుపునిచ్చారు. బాలలను పనిలో పెట్టుకున్నా, బాల కార్మికులుగా పనిచేయించినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే తప్పిపోయిన, వదిలివేయబడిన లేదా బాల కార్మికులుగా పనిచేస్తున్న చిన్నారుల సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా పోలీసు అత్యవసర సేవ 100కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, పోలీసు సిబ్బందిని పోలీసు కమిషనర్ అభినందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
