SAKSHITHA NEWS

డిసెంబర్ 31 వ తేదీలోగా తెలంగాణ కొత్త పర్యాటక విధానం తయారు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి దుబాయ్, సింగపూర్, చైనా వంటి దేశాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.

పర్యాటక విధానం రూపొందించే అంశంపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. పర్యాటక రంగం అభివృద్ధికి రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ గత పదేళ్లలో ప్రత్యేకమైన పాలసీ లేకపోవడం వల్ల నష్టపోయాం. హైదరాబాద్ వాతావరణం 365 రోజులు బాగుంటుంది కాబట్టి అత్యుత్తమైన పాలసీని తయారు చేయాలని చెప్పారు.

పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశం, ఆస్కారం ఉన్న ప్రాంతాల గురించి సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పర్యాటక అభివృద్ధి సంస్థ రూపొందించిన పర్యాటక ప్రాంతాలపై రూపొందించిన షార్ట్ ఫిలిమ్ ను ఆవిష్కరించారు.

టైగర్ రిజర్వు ఫారెస్ట్ లను దేవాలయాలతో కనెక్ట్ చేయడం, రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాల్లో పర్యాటకులు పెరిగేలా చూడాలన్నారు. ఉచిత బస్సు సౌకర్యం వల్ల టెంపుల్ టూరిజం గణనీయంగా పెరిగిందని, రొటీన్ టూరిజం కాకుండా కాన్సెప్ట్ టూరిజంపై దృష్టి సారించడం వంటి పలు అంశాలను సీఎం సూచించారు.

పర్యాటకులను ఆకర్షించడానికి ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేయాలి. విమానాశ్రయం నుంచి 20 నిమిషాల్లో చేరుకునేలా కన్వెన్షన్ సెంటర్ ఉండాలి.

రాష్ట్రంలో పర్యాటక శాఖ స్థలాల లీజులపైన ఆరా తీసిన ముఖ్యమంత్రి వాటిపై సమగ్ర నివేదిక తయారు చేయాలి. లీజు ముగిసినా ఖాళీ చేయని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. కోర్టు కేసులను సీరియస్ తీసుకుని స్టేలు ఎత్తివేసేలా చూడాలి. ఇకనుంచి మంచి గుర్తింపు ఉన్న కంపెనీలకు మాత్రమే పర్యాటక స్థలాలను లీజుకు ఇవ్వాలి.

ఖాళీ చేయబోయే ఉస్మానియా ఆసుపత్రి హెరిటేజ్ భవనాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. చార్మినార్ కు పర్యాటకులు పెరిగేలా అక్కడ పరిస్థితులు కల్పించాలి. సొంత కాళ్లపై నిలబడేలా టూరిజం శాఖ కసరత్తు చేయాలి.

ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి , టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ , సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు , సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి , టూరిజం ఎండీ ప్రకాష్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS