గోదావరిఖనిలో ఆహార భద్రతా అధికారుల ఆకస్మిక తనిఖీలు…..

Sakshitha news

గోదావరిఖనిలో ఆహార భద్రతా అధికారుల ఆకస్మిక తనిఖీలు…..

నిషేధిత రంగులు, పాత ఆహార పదార్థాల స్వాధీనం…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, : ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా గోదావరిఖని పట్టణంలోని పలు ఆహార వ్యాపార సంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ సహకారంతో నిర్వహించిన ఈ తనిఖీల్లో గోదావరిఖని బస్‌స్టాండ్ పరిసర ప్రాంతాలతో పాటు మార్కండేయ కాలనీలోని రెస్టారెంట్లు, స్వీట్స్ దుకాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

తనిఖీల సందర్భంగా పలుచోట్ల ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి.
నాని మండి ఫ్యామిలీ రెస్టారెంట్‌లో ఆహార తయారీలో నిషేధిత ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఫుడ్ కలర్స్‌తో తయారు చేసిన సుమారు 5 కిలోల చికెన్‌ను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే టోటల్ పోలార్ కాంపౌండ్స్ (TPC) మీటర్‌తో పరీక్షించగా వంటనూనెను పునర్వినియోగం చేస్తున్నట్లు తేలడంతో సుమారు 3 లీటర్ల వంటనూనెను కూడా ధ్వంసం చేశారు.

కాశ్మీర్ స్వీట్స్ అండ్ స్నాక్స్‌లో పరిశుభ్రత లోపాలు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. జిలేబీ, జాంగ్రీ వంటి మిఠాయిలలో మృత ఈగలు కనిపించగా, బంగాళాదుంప చిప్స్ పాతబడిన స్థితిలో ఉన్నట్లు తేలింది. దీంతో సుమారు 7 కిలోల మిఠాయిలు, ఒక కిలో బంగాళాదుంప చిప్స్‌ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.

జైకా మండి రెస్టారెంట్‌లో మండి రైస్ తయారీలో ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు, అలాగే పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోనైస్ నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా సుమారు 8 కిలోల మండి రైస్, 2 కిలోల మయోనైస్‌ను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.

నిబంధనలు ఉల్లంఘించిన ఆయా ఆహార వ్యాపార సంస్థలకు ఆహార భద్రతా చట్టాల ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఫుడ్ కలర్స్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వంటనూనెను సురక్షితంగా వినియోగించడం, పరిశుభ్రమైన విధానంలో మయోనైస్ తయారీ వంటి అంశాలపై నిర్వాహకులకు అవగాహన కల్పించారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Scroll to Top