వార్డు సందర్శనతో అభివృద్ధి పనులకు వేగం…
మిగిలిన పనులపై డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నాం….
–రామగుండం మేయర్ మహంకాళి స్వామి…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: రామగుండం, రామగుండం నగరంలోని మిగిలిపోయిన అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేసేందుకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేస్తున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా 12వ. డివిజన్ విట్టల్‌నగర్‌లో స్థానిక కార్పొరేటర్ షేక్ బాబూ మియాతో కలిసి ఆయన పర్యటించి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ప్రతి వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు రోడ్లు, యూజీడీ, డ్రైనేజీ కాలువలు, ఇతర మౌలిక సదుపాయాలు అవసరమైన ప్రాంతాలను గుర్తించి అంచనాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రాధాన్యత ఆధారంగా పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు.
విట్టల్‌నగర్‌లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని, ప్రతి ఇంటికి అంబులెన్స్ చేరుకునేలా అన్ని వీధుల్లో రహదారులు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని మేయర్ అన్నారు. చెత్తను రోడ్లపై లేదా కాలువల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేస్తే జరిమానాలు విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. పరిశుభ్రమైన పరిసరాల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.
పర్యటన సందర్భంగా రోడ్డుకు అడ్డుగా ఉన్న పిచ్చి మొక్కలు, చెట్ల కొమ్మలను తొలగించారు. కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి శుభ్రపరిచారు. ఫైవ్ ఇంక్ లైన్ మోరీ సమీపంలోని ఖాళీ స్థలాన్ని కూడా పరిశుభ్రం చేయించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చుక్కల శ్రీనివాస్, దొంత శ్రీనివాస్, నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, టీపీఎస్ నవీన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ మధుకర్, శానిటరీ జవాన్ శ్రీనివాస్, మెప్మా ఆర్‌పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
