అనాథ చిన్నారులకు ఉచిత మెగా వైద్య శిబిరం…
ఆరోగ్యంతో పాటు ఉన్నత విద్య లక్ష్యంగా ముందుకు సాగాలని విద్యార్థులకు ఎం ఇ ఓ జింక మల్లేష్, సీడీపీఓ అలేఖ్య పటేల్ పిలుపు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: రామగుండం, ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉంటూ బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని రామగుండం మండల విద్యాధికారి (ఎం ఇ ఓ ) జింక మల్లేష్ అన్నారు. నేటి పిల్లలే రేపటి మేధావులని, వారి ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని సీడీపీఓ అలేఖ్య పటేల్ పేర్కొన్నారు.
కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి సౌజన్యంతో, మాదిరెడ్డి ఇందుమతి భాస్కర్‌రావు చారిటబుల్ ట్రస్ట్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మాదిరెడ్డి భాస్కర్‌రావు వర్ధంతి సందర్భంగా రామగుండంలోని తబితా ఆశ్రమంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన ఎం ఇ ఓ జింక మల్లేష్, సీడీపీఓ అలేఖ్య పటేల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజ సేవా దృక్పథంతో మెడికవర్ ఆస్పత్రి సహకారంతో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ, మాదిరెడ్డి ఇందుమతి భాస్కర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు శేషు, నాగేశ్వరరావు, నాగరాజు, లీల, వంశీ, కావ్య ఆధ్వర్యంలో, మద్దెల దినేష్ నేతృత్వంలో ఈ శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. పిల్లలందరూ వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ మాట్లాడుతూ, నేటి పిల్లలే రేపటి భావి పౌరులని, శిబిరానికి విశేష స్పందన లభించిందన్నారు. శిబిరంలో చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులు, ఎనర్జీ డ్రింక్స్ అందించినట్లు తెలిపారు.
మెడికవర్ ఆస్పత్రి ప్రతినిధులు మాట్లాడుతూ, నిరుపేదలు, అనాథలకు ఉచిత వైద్య సేవలు అందించడం తమ సంస్థ సామాజిక బాధ్యతలో భాగమన్నారు. గుండె, రక్తపోటు, మధుమేహం, కంటి సంబంధిత వ్యాధులు, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
మెడికవర్ ఆస్పత్రి హెడ్ గుర్రం కిరణ్ ఆదేశాల మేరకు హెల్త్ క్యాంప్ అసోసియేట్ కె. రఘు, ఎంబీబీఎస్ వైద్యుడు ప్రవీణ్‌తో పాటు వైద్య బృందం సేవలందించింది.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు జితేందర్, కనుకరాజు, ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ శివకీర్తి, స్వప్న, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నిర్వాహకులు వై. లెనిన్, శ్రీనివాస్, గౌస్, తబితా ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ నాయక్, విమలతో పాటు పలువురు పాల్గొన్నారు.

