భాస్కర్‌రావు సేవలు చిరస్మరణీయం…
35వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ – ఏఐటీయూసీ నాయకులు….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకుడు మాదిరెడ్డి భాస్కర్‌రావు కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడని పలువురు నాయకులు కొనియాడారు. ఆయన 35వ వర్ధంతి సందర్భంగా మంగళవారం గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా స్మారక సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భాస్కర్‌రావు కార్మికుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు చేపట్టారని, కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం, కార్మిక ఉద్యమాల బలోపేతానికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. అలాంటి ప్రజానాయకుడిని అరాచక శక్తులు హత్య చేయడం కార్మిక లోకానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
భాస్కర్‌రావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని వారు స్పష్టం చేశారు.
అంతకుముందు గోదావరిఖనిలోని జీఎం కార్యాలయం వద్ద ఉన్న మాదిరెడ్డి భాస్కర్‌రావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కె. స్వామి, బ్రాంచ్ కార్యదర్శి రంగు శ్రీనివాస్, భాస్కర్‌రావు కుమారుడు శేషు కుమార్, నాయకులు సంకె అశోక్, మాదన మహేష్, పార్టీ నాయకులు గోసిక మోహన్, కన్నం లక్ష్మీనారాయణ, కనకరాజు, సూర్యతో పాటు పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
