రామగుండంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. డాగ్ స్క్వాడ్‌తో ప్రత్యేక చెకింగ్ నిర్వహణ….
సాక్షిత పెద్దపల్లి//జిల్లాప్రతినిధి: రామగుండం, రామగుండం పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రామగుండం సీఐ కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందం కలిసి ప్రత్యేక చెకింగ్ చేపట్టారు.
ఈ తనిఖీలు రామగుండం మజీద్ టర్నింగ్ ప్రాంతం, స్మోకింగ్ జోన్లు, పాన్ షాపులు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో నిర్వహించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పరిశీలించడంతో పాటు పరిసర ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
తనిఖీల సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన పోలీసులు, ప్రజల భద్రత కోసం మరియు నేరాలను ముందుగానే అరికట్టేందుకు ఇలాంటి ప్రత్యేక చెకింగ్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. రామగుండం ప్రాంతంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు, నేరాలకు అవకాశం లేకుండా చేయడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశ్యమని సీఐ కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంతర్గాం ఎస్సై వెంకట్, నార్కోటిక్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

