మణుగూరు బొగ్గు క్షేత్రాన్ని సింగరేణికే కేటాయించాలి.. వేలంపాట ప్రక్రియను నిలిపివేయాలి….
— ఏఐటియుసి….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: హైదరాబాద్, తెలంగాణలోని మణుగూరు పీ.కే–2 డీప్ సైడ్ బొగ్గు క్షేత్రాన్ని సింగరేణికే కేటాయించి, రాష్ట్ర విద్యుత్ సంస్థను వేలంపాట ప్రక్రియలో పాల్గొనకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి–గుర్తింపు సంఘం) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు సింగరేణి కార్మికుల ఆకాంక్షలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
మణుగూరు పీ.కే–2 డీప్ సైడ్ బొగ్గు క్షేత్రం సింగరేణి భవిష్యత్తుకు అత్యంత కీలకమైందని, వేలాది మంది కార్మికుల ఉపాధి, సంస్థ ఉత్పత్తి, తెలంగాణ ఆర్థిక ప్రయోజనాలు ఈ బొగ్గు నిల్వలపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ఈ క్షేత్రాన్ని సింగరేణికి కాకుండా ఇతర సంస్థలకు కేటాయించే ప్రయత్నాలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
రాష్ట్ర విద్యుత్ సంస్థను వేలంపాట ప్రక్రియలో పాల్గొనకుండా ప్రభుత్వం అడ్డుకోవాలని, ఆ పేరుతో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించే ప్రయత్నాలను ఏఐటియుసి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు. పీ.కే–2 డీప్ సైడ్ బొగ్గు క్షేత్రాన్ని నేరుగా సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు సింగరేణిని బలోపేతం చేస్తామని ప్రభుత్వం చెబుతూనే, మరోవైపు కీలక బొగ్గు క్షేత్రాల విషయంలో అనిశ్చితి సృష్టించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. తగినంత బొగ్గు నిల్వలు లేకపోతే భవిష్యత్తులో ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు వేలాది మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణి సంస్థను బలహీనపరిచే ఎలాంటి చర్యలనైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అవసరమైతే కార్మికులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. “సేవ్ సింగరేణి – సేవ్ మణుగూరు” నినాదంతో సింగరేణి పరిరక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సింగరేణి పదవీ విరమణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణుమాధవ్, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు కే. వెంకటేష్, ఎస్. నర్సింగ్‌రావు, కే. బీరయ్య, ఎ. ప్రభాకర్, ఎం. రాజనర్సు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
