SAKSHITHA NEWS

ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్‌రామ్‌.

జాతి జనులను విద్యావంతులుగా, ఆత్మాభిమానులుగా చేయాలన్నదే ఆయన లక్ష్యం. బిహార్‌లోని షాబాద్‌ జిల్లా, చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్‌ 5న శోభిరామ్, బసంతి దేవిలకు జగ్జీవన్‌ రామ్‌ జన్మించాడు. ఆయన చదువుకున్న పాఠశాలలో మొదటిసారిగా అంటరానితనాన్ని అనుభవించాడు. ఆ పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవలపై ‘హిందూ పానీ’, ‘ముస్లిం పానీ’ అని రాసి ఉంచేవారు. జగ్జీవన్‌రామ్‌ హిందూ పానీ కడవలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు తాగేవారు కాదు. ఈ ఉదంతంతో ఆగ్రహించిన ఆయన ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కలు చేశాడు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘హరిజన పానీ’ అనే మరో కుండను ఏర్పాటుచేశాడు. జగ్జీవన్‌రామ్‌ ఆ కుండని కూడా పగులకొట్టాడు. ఇక చేసేదేమీ లేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటుచేశారు. ఈ సంఘటనలో గెలిచినా ఆయన గుండె ఆవేదనతోనూ, కోపంతోనూ నిండిపోయింది. ఆ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృతివైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయి.

విద్యార్థి దశలోనే గాంధీజీ అహింసా మార్గానికి ఆకర్షితుడై 1930లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. కేవలం 27 ఏళ్ల వయస్సులోనే శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 57 ఏళ్లపాటు పార్లమెంటును ఏలిన మహా అనుభవశీలి ఆయన. వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వే శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన సేవలు అందించారు. జగ్జీవన్‌రామ్‌ తాను చేపట్టిన ప్రతీ బాధ్యతలోనూ తనదైన ముద్రవేసిన కార్యదక్షుడు. బ్రిటీష్ రైల్వే వ్యవస్థను ప్రక్షాళన చేసి భారతీయ ముద్ర వేశారు. 1967-70లో ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత మండలాలను అభివృద్ధి చేసి మొదటిసారి భారతదేశం ఆహార స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా చేసి, దేశాన్ని కరువు బారి నుంచి కాపాడారు. 1970-74లో రక్షణ శాఖ మంత్రిగా పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ను విముక్తి చేసి, పాకిస్తాన్‌ సేనలు బేషరతుగా లొంగిపోయేలా చేశారు.

జగ్జీవన్‌రామ్‌లో ఉన్న తన వారికి చేయాలనే ఆరాటం… పోరాటం ఇప్పుడు ఉన్న దళిత ఎంపీ, ఎమ్మెల్యేలు అలవరుచుకోవాలి. దళితుల హక్కులను రాజ్యాంగంలో అంబేడ్కర్‌ పొందుపరిస్తే, వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్‌రామ్‌ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిది. అవమానాలు, ఆటంకాలను విజయాలుగా మలుచుకున్న నిజమైన దేశ నాయకుడు జగ్జీవన్‌రామ్‌. అందుకే ఆయన భవిష్యత్తు తరాలకు కూడా ఆదర్శవంతుడు. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన 1986 జూలై 6న కన్నుమూశారు. ఆయన జన్మదినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా సమతా దినోత్సవంగా జరుపుతోంది. దేశం కోసం.. స్వాత్యంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా, సాంఘిక సమానత్వం కోసం అణగారిన వర్గాల కోసం చివరి శ్వాస వరకూ కృషి చేసిన జగ్జీవన్‌రామ్‌ను భారతరత్నతో గౌరవించాలి.


SAKSHITHA NEWS