SAKSHITHA NEWS

సైన్స్ అంటే నిజం – గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం సైన్స్ పై పట్టు కలిగే విధంగా ప్రోత్సాహం

విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి
………….జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

*సాక్షిత వనపర్తి :
గ్రామీణ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు సరైన సైన్స్ కిట్ లేకపోవడం వల్ల సైన్స్ సబ్జెక్ట్ లో వెనుకబడి పోతుంటారని అందువల్ల వారిలోని సాంకేతిక నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సైన్స్ కిట్లు మంజూరు చేయడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో స్థానిక సూర్య చంద్ర ప్యాలెస్ హైస్కూల్ లో నుండి మూడు రోజుల పాటు నిర్వహించనున్న 52వ రాష్ట్ర బాల వైజ్ఞానిక దర్శిని మరియు 12వ ఇన్స్పిరేషన్ అవార్డుల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు.
పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలక్టర్ మాట్లాడుతూ సైన్స్ అంటే నిజం అని ఇది జీవితంలో చాలా ముఖ్యమైనదని అన్నారు. చాల సంవత్సరాల ముందు నుంచే విద్యా పరంగా వనపర్తి ముందు ఉంటుందని, పాలిటెక్నిక్ కళాశాల, పి.జి కళాశాల తదితర కళాశాలలు ఇక్కడ ఉన్నాయని ఇలాంటి ప్రాంతంలో వైజ్ఞానిక పరంగా కూడా ముందు ఉంచాడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. గ్రామీణ విద్యార్థులకు సైన్స్ పట్ల ఆకర్షితులను చేయడానికి జిల్లా యంత్రాంగం నుండి అన్ని పాఠశాలలకు సైన్స్ కిట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగంలో సైతం వైజ్ఞానిక రంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించబడిందని గుర్తు చేశారు.


విద్యార్థులు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని, స్ఫూర్తి పొంది భవిష్యత్తులో ఐ.ఐ.టి, ఎయిమ్స్ వంటి గొప్ప కళాశాలల్లో సీట్లు సంపాదించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యా శాఖ అధికారి గోవింద రాజులు మాట్లాడుతూ నేటి నుంచి 3 రోజుల పాటు సైన్స్ ఫెయిర్ తో పాటు కేంద్ర ప్రభుత్వ 12 వ ఇన్స్పిరేషన్ అవార్డు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జూనియర్ స్థాయిలో 6 నుండి 10 వ తరగతి విద్యార్థులు, సీనియర్ స్థాయిలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైన్స్ ప్రదర్శన పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పాల్గొనే ఈ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన వారిని డిసెంబర్ మొదటి వారంలో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలకు పంపడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఇన్స్పిరేషన్ అవార్డుల్లో మొదటిస్థానం పొందిన వారికి స్కాలర్ షిప్ సైతం అందజేయడం జరుగుతుందని తెలియజేశారు.
ప్రపంచం ఇంత వేగంగా అభివృద్ధి సాధించడానికి కారణం విజ్ఞాన శాస్త్రం అభివృద్దే అని , వనపర్తి జిల్లాలోని విద్యార్థులను విజ్ఞాన శాస్త్ర పరంగా అభివృద్ధి సాధించేందుకు ఉపాద్యాయులు విద్యాబుద్దులు బాగా నేర్పించి ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాలల్లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని విద్యార్థిలోని నైపుణ్యాన్ని వెలికి తీసేవిధంగా ఉపాద్యాయులు కృషి చేయాలని తెలియజేశారు. వనపర్తి జిల్లాకు ఉన్న విద్యాపర్తి జిల్లా పేరును మరింత బలోపేతం చేయాలని కోరారు.
కార్యక్రమం అనంతరం కలెక్టర్ విద్యార్థులు తయారు చేసిన విజ్ఞాన ప్రదర్శనలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా సైన్స్ ఆఫీసర్ శ్రీనివాస్, మండల విద్యా అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS