సెప్టెంబర్‌లోగా గ్రామీణ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి….

Sakshitha news

సెప్టెంబర్‌లోగా గ్రామీణ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి….

నాణ్యతలో రాజీ లేదు.. డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధుల పనుల్లో వేగం పెంచాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి.పెద్దపల్లి, జిల్లాలో డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ప్రొజెక్టర్ ద్వారా పరిశీలించిన కలెక్టర్, పనుల అమలులో జాప్యానికి తావులేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులతో మంజూరైన అన్ని అభివృద్ధి పనులను ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి పూర్తిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పనిని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల్లో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని సూచించారు.

అంగన్‌వాడీ భవనాల మరమ్మత్తు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి చిన్నారులకు సురక్షితమైన, మెరుగైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ శంకరయ్యతో పాటు వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top