ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యల ఆదేశాలు….
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:
జిల్లాలో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రతి అర్జీని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సమక్షంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూ, మున్సిపల్, రెవెన్యూ తదితర సమస్యలను స్వయంగా విని, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంతర్గం మండలం గోలివాడ గ్రామానికి చెందిన కాంపల్లి పద్మ తన భర్త మరణానంతరం విరాసత్ పట్టా మార్పిడి జరిగిన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి పట్టాదార్ పాస్‌పుస్తకం జారీ చేయాలని కోరగా, తహసీల్దార్‌కు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
రామగుండం నగరంలోని లక్ష్మీపురానికి చెందిన మినుగు పృథ్వీరాజ్ మున్సిపల్ అధికారులు తమ నివాస గృహాలను అక్రమంగా కూల్చివేశారని ఫిర్యాదు చేయగా, అంశంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు.
ధర్మారం మండలానికి చెందిన నూనె వెంకట నర్సయ్య తన భూమికి వెళ్లే మార్గాన్ని అడ్డుకుంటూ భూమి గుర్తులను తొలగించారని ఫిర్యాదు చేయగా, చట్టపరంగా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
