మౌళిక వసతులను త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
ఈ రోజు పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట్, బాచుపల్లి, కైసర్ నగర్, దుండిగల్, డి. పోచంపల్లి, బహదూర్‌పల్లి, దేవేందర్ నగర్ ప్రాంతాలకు చెందిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయాలలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ సంబంధిత శాఖల అధికారులతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో హౌసింగ్ బోర్డు, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖ, మున్సిపాలిటీ, ఇంజనీరింగ్ తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొని సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ, పేద ప్రజలకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే లక్ష్యంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరదృష్టితో సకల సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి వేలాది మంది పేద కుటుంబాలకు అందజేశామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆ ఇళ్ల సముదాయాల్లో నివసిస్తున్న లబ్ధిదారులకు అవసరమైన కనీస మౌలిక వసతులు సకాలంలో కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా జీవించేందుకు అవసరమైన మౌలిక వసతులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సరఫరా, వీధిదీపాల ఏర్పాటు, రహదారుల అభివృద్ధి, రవాణా సౌకర్యాల కల్పన వంటి అంశాలను అత్యంత ప్రాధాన్యంతో తీసుకోవాలని సూచించారు.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా రోజుకు రెండు సార్లు తాగునీటిని విడుదల చేసేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
విద్యుత్ సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించి, కాలనీల్లో తగినంత వీధిదీపాలను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద భద్రతా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసిస్తున్న ప్రతి లబ్ధిదారుడికి సొంతింటి భరోసా కలిగించే విధంగా ఇంటి నెంబర్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు.
సముదాయాల్లో నివసిస్తున్న ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేవాలయం, మసీదు, చర్చి వంటి ప్రార్థనా మందిరాల మరియు వైకుంఠ ధామాల నిర్మాణానికి తగిన స్థలాలను కేటాయించాలని అధికారులను కోరారు.
లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పరిష్కరించి, డబుల్ బెడ్‌రూమ్ కాలనీలను ఆదర్శవంతమైన నివాస సముదాయాలుగా తీర్చిదిద్దాలని అన్నారు.
ఈ సమావేశంలో నిజాంపేట్, బాచుపల్లి, కైసర్ నగర్, దుండిగల్, డి. పోచంపల్లి, బహదూర్‌పల్లి ప్రాంతాలకు చెందిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గాజుల రామారం ఉప కమిషనేర్, ఇంజనీరింగ్ శాఖ, హౌసింగ్ బోర్డు, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖ, మున్సిపాలిటీ తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
