SAKSHITHA NEWS

ప్రధానమంత్రి సూర్య ఘర్…..రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీ ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి?

ఇటీవల ప్రకటించిన ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్‌ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో, సబ్సిడీ ధరకే ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. సబ్సిడీ తీసుకోవడంతో పాటు మీ ఇంటికి జీవితకాలం ఉచితంగా విద్యుత్‌ పొందొచ్చు.

కొత్త రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్‌ను (పీఎం సూర్య ఘర్ ముప్త్‌ బిజిలీ యోజన) తొలిసారిగా ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ తర్వాత, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 01న లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పిస్తూ పథకం గురించి ప్రస్తావించారు. ఈ పథకం కింద, దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపైన సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సామాన్యులకు, ప్రభుత్వానికి ప్రయోజనం
ఈ పథకం వల్ల సామాన్యులు, ప్రభుత్వం రెండూ లబ్ధి పొందుతాయి. సాధారణ ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సౌరశక్తితో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. తద్వారా, విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి పొందుతారు. ప్రతి నెలా వేల రూపాయలు ఆదా అవుతాయి. సౌరశక్తి నుంచి మరింత ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా, విద్యుత్‌ అవసరాల్లో భారత్‌ స్వావలంబన సాధించగలుగుతుంది.

రూ.78 వేల వరకు సబ్సిడీ
అధికారిక ప్రకటన ప్రకారం, 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ సిస్టమ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.30 వేలు సబ్సిడీ ఇస్తుంది. 2 కిలోవాట్ల ప్యానల్‌కు రూ.60 వేలు సబ్సిడీ, 3 కిలోవాట్ల సోలార్ ప్యానల్ సిస్టమ్‌కు రూ.78 వేలు సబ్సిడీ లభిస్తుంది.

తాకట్టు లేకుండా చౌక వడ్డీ రుణం
సబ్సిడీ పోను, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు వెచ్చించే అదనపు మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు. దీనిపై తక్కువ వడ్డీ తీసుకుంటారు. ఈ లోన్‌ కోసం సామాన్య ప్రజలు ఎలాంటి పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రకటన ప్రకారం, ఇంటి పైకప్పుపై గరిష్టంగా 3 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర ఫలకాలను బిగించుకోవడానికి 7 శాతం వడ్డీ రేటుతో కొలేటరల్ ఫ్రీ లోన్ (తాకట్టు లేని రుణం) అందుబాటులో ఉంటుంది.

సబ్సిడీ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

ముందుగా https://pmsuryaghar.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలి.

  • రిజిస్ట్రేషన్ కోసం, విద్యుత్ పంపిణీ సంస్థ పేరు, కస్టమర్ నంబర్, మొబైల్, ఇ-మెయిల్ అవసరం.
  • వినియోగదారు/కస్టమర్ నంబర్, మొబైల్ నంబర్ సాయంతో పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
  • రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి ఫామ్‌ను ఎంచుకోండి.
  • సమీక్ష తర్వాత, అర్హుడైన దరఖాస్తుదారుకు ఆమోదం లభిస్తుంది.
  • ఆమోదం పొందిన తర్వాత, సంబంధిత డిస్కంలో నమోదు చేసుకున్న ఏదైనా విక్రేత నుంచి ప్యానెల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
  • ప్యానెల్ ఇన్‌స్టలేషన్ తర్వాత, ఫ్లాంట్‌ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోండి.
  • నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత & డిస్కమ్‌ తనిఖీ తర్వాత, పోర్టల్‌లో కమీషనింగ్ సర్టిఫికేట్ అందుబాటులో ఉంటుంది.
  • సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, బ్యాంక్ ఖాతా వివరాలు, క్యాన్సిల్‌ చేసిన చెక్‌తో సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోండి.
  • 30 రోజుల్లోగా మీ బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీ మొత్తం క్రెడిట్‌ అవుతుంది.
WhatsApp Image 2024 03 02 at 12.01.10 PM

SAKSHITHA NEWS