రేషన్ పంపిణీలో అక్రమాలు నివారణ
** స్మార్ట్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే శ్రీనివాసులు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: క్యూఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డులను ఉదయం ఎన్జీఓ కాలనీలో ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు పంపిణీ చేశారు. పాత రేషన్ కార్డుల స్థానంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. క్యూఆర్ కోడ్ తో రేషన్ కార్డు దారుని వివరాలు, రేషన్ ఎప్పుడు, ఎక్కడ తీసుకున్నారు అనే వివరాలు స్పష్టంగా తెలుస్తాయని ఆయన చెప్పారు. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా రేషన్ ను పేదలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్పునకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. తిరుపతిలో 66,243 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. వీరికి నగరంలోని 102 చౌక దుఖాణాల ద్వారా రేషన్ ప్రతినెలా అందిస్తున్నట్లు తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు ప్రతి నెల 26వ తేది నుంచి 31 వ తేది వరకు ఇంటి వద్దకే రేషన్ అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రతి నెల ఒకటవ తేది నుంచి 15వ తేది వరకు రేషన్ సరుకులు రెండు పూటల కార్డు దారులకు అందిస్తున్నామని చెప్పారు. కొత్త కార్డులు సెప్టంబర్ నెల నుంచి అందించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. నిరంతర ప్రక్రియగా కొత్త కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. గత వైసిపి పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని వివమర్శించారు. పేదల బియ్యాన్ని అక్రమ రవాణా సాగించి కోట్ల రూపాయలు వైసిపి నాయకులు కొల్లగొట్టి పేదల కడుపు కొట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ రాజు, తహసిల్దారు సురేష్ కుమార్, ఏపి అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్ రాయల్, ఎస్సీ కార్పోరేషన్ డైరక్టర్ కుమారమ్మ, డిప్యూటి మేయర్ ఆర్సీ మునికృష్ణా, జనసేన కార్పోరేటర్స్ సికే రేవతి, కల్పనా యాదవ్, వరికుంట్ల నారాయణ, పుష్పావతి, దంపూరు భాస్కర్, రాజారెడ్డి, మహేష్ యాదవ్, వెంకటేశ్వర్లు, తిరుత్తణి వేణుగోపాల్, దూదిశివ, బాలిశెట్టి కిషోర్, అన్నారెడ్డి యువరాజ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రమేష్ నాయుడు, మునస్వామి, కెవి రమణ, సూర్యకుమారి, రాధా తదితరులు పాల్గొన్నారు.
