“ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యం….. పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కారం కలెక్టర్ కోయ శ్రీహర్ష….”
సాక్షిత పెద్దపల్లి :+ అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వాటిని పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి. వేణుతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
రామగిరి మండలం 8 ఇంక్లైన్ కాలనీకి చెందిన కే. రాజమ్మ తన భూమిని తప్పుడు కాగితాలతో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని, తన సంతకాలను ఫోర్జరీ చేశారని పేర్కొంటూ దరఖాస్తు చేసుకోగా, ఆ అంశంపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ పెద్దపల్లికి కలెక్టర్ ఆదేశించారు.
జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన ఏ. భూమయ్య ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినప్పటికీ, నిర్మాణానికి అవసరమైన ఖర్చు భరించలేనని, ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలతో రేకుల షెడ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరగా, ఈ విషయంపై పీడీ హౌసింగ్ అధికారులకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఎస్. మదన్ మోహన్ రైలుప్రమాదంలో కాలు కోల్పోయినప్పటికీ ఇప్పటివరకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు కాలేదని, అలాగే అంత్యోదయ రేషన్ కార్డు ఇవ్వాలని కోరగా, సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY