పాత మొబైల్స్ పేరుతో మోసాలు.. అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి , గ్రామాల్లోకి వచ్చే అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పాత మొబైల్ ఫోన్లకు బదులుగా ప్లాస్టిక్ వస్తువులు ఇస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని పోలీసులు గ్రామస్తులను హెచ్చరించారు.
పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో పాత మొబైల్ ఫోన్లకు బదులుగా ప్లాస్టిక్ సామగ్రి ఇస్తూ, తిరుగుతున్న వ్యక్తులను గ్రామస్తుల సహకారంతో పట్టుకుని పోలీసులకు అప్పగించిన సర్పంచ్ వేల్పుల రమేష్‌ను పోలీసులు అభినందించారు.
గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పాత మొబైల్స్ సేకరిస్తున్న వ్యక్తుల ప్రవర్తనపై అనుమానం రావడంతో సర్పంచ్ వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ తిరుపతి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పాత మొబైల్స్ సేకరణ పేరుతో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. పాత మొబైల్ ఫోన్లలో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఫోటోలు వంటి కీలక డేటా ఉండే అవకాశముందని, వాటిని దుర్వినియోగం చేసి సైబర్ నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇలాంటి వ్యక్తులను నమ్మి పాత మొబైల్స్ ఇవ్వవద్దని, గ్రామాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గ్రామ భద్రత కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.
పోలీసులకు సమాచారం అందించి సహకరించిన సర్పంచ్ వేల్పుల రమేష్‌ను పోలీస్ శాఖ తరఫున అభినందించారు.

