పెద్దపల్లి జిల్లాలో జోరుగా మొక్కజొన్న కొనుగోళ్లు…

Sakshitha news

పెద్దపల్లి జిల్లాలో జోరుగా మొక్కజొన్న కొనుగోళ్లు…

10 వేల మెట్రిక్ టన్నులు దాటిన సేకరణ….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లు అత్యంత పారదర్శకంగా, వేగంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లాలో మొత్తం 23,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించగా, మే 20 నాటికి ఇప్పటికే రికార్డు స్థాయిలో 10,089 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తయ్యాయని కలెక్టర్ వెల్లడించారు. కేవలం ఈరోజు ఒక్కరోజే సుమారు 1,600 మెట్రిక్ టన్నుల పంటను రైతుల నుంచి సేకరించడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో అందుబాటులో ఉన్న మొత్తం నిల్వ సామర్థ్యం కూడా 23,000 మెట్రిక్ టన్నులుగా ఉందని, రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న నిల్వ కోసం గోదాములు, మార్కెట్ కమిటీలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

పెద్దపల్లి ఏఎంసీ, ఓదెల, పోత్కపల్లి, శ్రీరాంపూర్, కూనారం తదితర 9 కొనుగోలు కేంద్రాల పరిధిలో రవాణా వ్యవస్థను మరింత వేగవంతం చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములకు మొక్కజొన్న తరలించేందుకు జిల్లా వ్యాప్తంగా 91 ట్రాక్టర్లు, 19 లారీలు/డీసీఎంలు కలిపి మొత్తం 110 వాహనాలు నిరంతరం సేవలందిస్తున్నాయని వివరించారు.

రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు పడకుండా తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రవాణాలో ఆలస్యం జరగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు.

Scroll to Top