ఎల్ఈడీ లైట్లతో రాత్రి ప్రయాణం ప్రమాదకరం.. కళ్లు చెదిరే వెలుగులతో పెరుగుతున్న ప్రమాదాలు….
…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రాత్రి 7 గంటలు దాటితే చాలు వాహనదారుల్లో భయం మొదలవుతోంది. ఎదురుగా వచ్చే వాహనాల హై పవర్ ఎల్ఈడీ లైట్ల వెలుగులు కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతూ ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు, పట్టణ ప్రధాన రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది.
ఇటీవల మార్కెట్లోకి వస్తున్న కొత్త వాహనాల్లో అధిక ప్రకాశంతో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్లు అమర్చడం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు రోడ్డు స్పష్టంగా కనిపించడం లేదు. కొన్నిసార్లు కొన్ని క్షణాల పాటు కళ్లు మసకబారి ఏమీ కనిపించకుండా పోతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, వృద్ధులు, రాత్రిపూట ఎక్కువగా ప్రయాణించే లారీ, ఆటో డ్రైవర్లు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వస్తున్న వాహనం దగ్గరపడే సమయంలో ఎల్ఈడీ లైట్ల తీవ్ర కాంతి కారణంగా రోడ్డు పక్కలు, డివైడర్లు, గుంతలు కూడా కనిపించక ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
గతంలో వాహనాల హెడ్‌లైట్లపై సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ వేయాలనే నిబంధనలు అమల్లో ఉండేవి. ఆ విధానం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు కాంతి ప్రభావం కొంతవరకు తగ్గేది. ప్రస్తుతం అలాంటి నియంత్రణలు కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. ఆ నిబంధన ఇప్పటికీ ఉందా? లేక పూర్తిగా ఎత్తివేశారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు కొంతమంది వాహన యజమానులు కంపెనీ ఫిట్టింగ్ కాకుండా మార్కెట్లో లభించే అధిక పవర్ ఎల్ఈడీ బల్బులు అమర్చుకోవడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది. కొందరు హై బీమ్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అవసరం లేని సమయంలో హై బీమ్ వినియోగించకూడదు. అయినప్పటికీ చాలామంది ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదని వాహనదారులు చెబుతున్నారు. రాత్రిపూట రహదారులపై ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీవో అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అధిక కాంతి ఇచ్చే అనధికార ఎల్ఈడీ లైట్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కనీసం హెడ్‌లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ తప్పనిసరి చేయాలని, హై బీమ్ వినియోగంపై కఠిన నియంత్రణలు అమలు చేయాలని, రాత్రి డ్రైవింగ్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
రోడ్డు భద్రత అనేది కేవలం ట్రాఫిక్ పోలీసుల బాధ్యత మాత్రమే కాదు.. ప్రతి వాహనదారుడి సామాజిక బాధ్యత కూడా. మన వాహనం వెలుగు ఎదుటివారి ప్రాణాలకు ప్రమాదంగా మారకూడదనే అవగాహన ప్రతి ఒక్కరిలో రావాల్సిన అవసరం ఉంది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
