విశిష్ట సేవలకు ఘన గౌరవం, ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్‌ఐ సంజీవయ్యకు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆత్మీయ వీడ్కోలు…

Sakshitha news

విశిష్ట సేవలకు ఘన గౌరవం, ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్‌ఐ సంజీవయ్యకు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆత్మీయ వీడ్కోలు…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) సంజీవయ్యకు కమిషనరేట్ కార్యాలయంలో ఘన సన్మానం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ సహజమైన ఘట్టమని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎన్నో సంవత్సరాల పాటు అంకితభావంతో సేవలందించిన సంజీవయ్య సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు.

ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఎలాంటి అవసరం వచ్చినా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సంజీవయ్య, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని, వారి పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగి జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ కె. శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ రమేష్, ఆర్ఐ రమేష్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం, సీసీ సందీప్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.