లక్ష్మీనగర్ అభివృద్ధికి వ్యాపారుల సహకారం అవసరం….
పారిశుధ్యం, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి సంయుక్తంగా కృషి చేయాలి…
— మేయర్ మహంకాళి స్వామి…
…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం, నగరంలోని ప్రధాన వాణిజ్య కేంద్రం లక్ష్మీనగర్‌లో పారిశుధ్యం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి వ్యాపారులు సహకరించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు.
రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో లక్ష్మీనగర్, కళ్యాణ్‌నగర్ ప్రాంతాలకు చెందిన వ్యాపార సంస్థల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, లక్ష్మీనగర్‌లో రోజుకు రెండు పూటలా పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నప్పటికీ కొంతమంది వ్యాపారులు, ప్రజలు తిరిగి రోడ్లపై చెత్త వేయడం వల్ల పరిశుభ్రతకు భంగం కలుగుతోందని అన్నారు.
ప్రతి వ్యాపార సంస్థ తమ దుకాణం ముందు చెత్త బకెట్ ఏర్పాటు చేసుకుని అందులోనే వ్యర్థాలను వేయాలని సూచించారు. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ చొరవతో రూ.34 కోట్ల వ్యయంతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టి విశాలమైన రహదారులు నిర్మించినప్పటికీ, కొంతమంది వ్యాపారులు షాపుల ముందుకు వస్తువులు ఉంచడం, సిబ్బంది వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
లక్ష్మీనగర్‌లో పార్కింగ్ సౌకర్యాల కోసం మూడు ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని వ్యాపారులకు సూచించారు.
ఈ సందర్భంగా వ్యాపారులు పార్కింగ్ నియంత్రణ కోసం రోడ్లపై మార్కింగ్ లైన్లు వేయాలని, మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలు వచ్చినప్పుడు ముందస్తు సమాచారం అందించేందుకు మైకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. వ్యాపారాభివృద్ధికి నగరపాలక సంస్థ మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మరియు నగరపాలక సంస్థ కమిషనర్ జె. అరుణశ్రీ, ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్‌రావు, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, కార్పొరేటర్లు మేకల సమ్మయ్య, చిదురాల నాగరాజు, ముస్తఫా, ధూళికట్ట సతీష్, నాయకులు రాజేందర్, మహేష్, అశోక్‌రావు, రాజేష్ శర్మ, రామస్వామి, సారయ్య, రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
