పోలీసులు.. సమాజ రక్షణ కవచాలు
** అమర పోలీసుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ వెంకటేశ్వర్
….
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: “పోలీస్ అధికారులు, సిబ్బంది మన సమాజ భద్రతకు రక్షణ కవచం లాంటివారని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు.
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా తిరుపతిలోని ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సంస్మరణ సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఎస్పీ సుబ్బరాయుడు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ అధికారులతో పాటు జిల్లాలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు, అధికారులు, మీడియా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా అమరవీరుల స్మారక స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ పోలీసులు వారి కుటుంబం, వ్యక్తిగత జీవితం పక్కనపెట్టి ప్రజల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రసంశించారు. దేశ సేవలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం అని కొనియాడారు. వారి సేవలు, నిబద్ధత భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఇలాంటి అమరుల కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ అండగా నిలవాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ దేశ భద్రత, ప్రజా శాంతి కోసం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా “అమరవీరుల జాబితా”ను చదివి వినిపించి, రెండు నిమిషాల మౌనం పాటించి వారికి గౌరవ నివాళులు అర్పించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ద్వారా దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటాము. గత సంవత్సరం అక్టోబర్ 21, నుండి ఈ సంవత్సరం అక్టోబర్ 20 వరకు దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది, రాష్ట్రంలో 5 మంది పోలీసులు వీరమరణం పొందారని చెప్పారు. వీరందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు విధి నిర్వహణలో అశువులు బాసిన 25 మంది పోలీస్ సిబ్బంది త్యాగం చిరస్మరణీయం. పోలీస్ శాఖ సిబ్బంది సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు పరుస్తున్నామని, ప్రతి సిబ్బంది కుటుంబం సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నా మని తెలిపారు.
అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం
ఈ సంస్మరణ కార్యక్రమంలో అమరులైన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ యల్. సుబ్బరాయుడు ఘనంగా సన్మానించారు.
ప్రతి కుటుంబ సభ్యునికి శాలువ కప్పి, జ్ఞాపికలు ప్రధానం చేసి, వారిని సత్కరించారు. పోలీస్ సిబ్బంది త్యాగం వ్యర్థం కాదని, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అధికారులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు (పరిపాలన), రవి మనోహరాచారి (శాంతిభద్రతలు), నాగభూషణరావు (నేర విభాగం), ఇంటిలిజెన్స్ అదనపు ఎస్పీలు, జిల్లా పోలీస్ అధికారులు, సివిల్ అధికారులు, పోలీస్ సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో జిల్లా ఎస్పీ “పోలీస్ అమరవీరులకు జోహార్లు – జైహింద్!” అంటూ ముగించారు.
