నేటినుంచి కపిలతీర్థంలో కార్తీకమాస పూజలు
** నవంబర్ 20 వరకు విశేష హోమ మహోత్సవాలు
....
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కల్యాణం కోసం తిరుపతిలోని శ్రీకపిలేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం (నేటి) నుంచి నవంబరు 20వ తేదీ వరకు నెల రోజుల పాటు విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ హోమ మహోత్సవాలకు బుధవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఇందులో ఈనెల 23వ తేదీ వరకు మొదటగా శ్రీగణపతిస్వామి వారి హోమం, 24 నుంచి 26వ తేదీ వరకు శ్రీసుబ్రమణ్య స్వామివారి హోమం, 27న శ్రీదక్షిణామూర్తి స్వామివారి హోమం, 28న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి.
29న శ్రీకాలభైరవ స్వామివారి హోమం, 30 నుంచి నవంబరు 7వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారిహోమం(చండీహోమం), నవంబరు 8 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం), నవంబరు19న ధర్మశాస్త్ర హోమం, నవంబరు 20న శ్రీచండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించ నున్నారు. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్తులు కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది. ఈ హోమాల్లో భాగంగా ఈనెల 27న శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి కల్యాణం, నవంబరు 18న మాస శివరాత్రి నాడు శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం జరుగనున్నాయి. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక్కో కల్యాణంలో పాల్గొనవచ్చు.
హోమ మహోత్సవాలకు విశేష ఆదరణ:
శ్రీ కపిలేశ్వరాలయంలో టీటీడీ నిర్వహిస్తున్న హోమ మహోత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. 2012వ సంవత్సరంలో ఈ హోమాలను టీటీడీ ప్రారంభించింది. ఈ హోమాల్లో పాల్గొంటున్న భక్తుల సంఖ్య ప్రతి ఏడాదీ పెరుగుతోంది. ఈ హోమాలను సొంతంగా చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పనికావడంతో భక్తుల సౌకర్యార్థం సామూహికంగా ఈ హోమాలను టీటీడీ నిర్వహిస్తోంది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
