వానకాలం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించిన…………..మదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
…….
*సాక్షిత వనపర్తి :
జిల్లాలో వానాకాలం సీజన్ 2024-25 కు సంబంధించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పక్కా ప్రణాళికతో సన్నద్దం కావాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ అన్నారు.
వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణి హాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ నగేష్ తో కలిసి పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూపొందించుకున్న ప్రణాళిక, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, తదితర అంశాలను అధికారులు వివరించారు.
ఈ సందర్బంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్ లకు, వ్యవసాయ శాఖ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వనపర్తి జిల్లాలో 297 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత సీజన్ లో వరి గ్రేడ్ ఏ రకం ధాన్యానికి రూ.2320 , సాధారణ రకం ధాన్యానికి రూ.2300 మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని అన్నారు.
మరి కొద్ది రోజుల్లో రైతులు ధాన్యం తెచ్చే అవకాశం ఉండడంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలతో సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సూచించారు. ధాన్యం బరువు కొలిచే యంత్రాలు, గోనె సంచులు, ధాన్యం వర్షానికి తడవకుండా టార్పాలిన్లు, రైతులకు తాగునీరు, తేమ కొలిచే యంత్రాలు వంటి అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ అనంతరం ఏ మిల్లుకు ట్రాన్స్ పోర్టు చేయాలనే అంశంపై అధికారులు ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన అనంతరం ట్యాబ్ ఎంట్రీ సహా ఇతర ప్రక్రియలు వేగంగా పూర్తి కావాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
సన్నాలను గుర్తించడంలో అవగాహన తప్పనిసరి
సన్న రకం వరి ధాన్యానికి సంబంధించి కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. సన్న రకానికి ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇస్తుందని, రైతులకు నష్టం కలగకుండా వాటిని సరిగా గుర్తించాలని చెప్పారు. ఆ తర్వాత సన్నాల గన్నీ బాగులను ప్రత్యేకంగా లోడ్ చేయాలని చెప్పారు. ప్రతి సంచి పై నెంబర్ తప్పనిసరిగా వేయాలన్నారు.
సమావేశంలో పౌర సరఫరాల శాఖ డిఎం ఇర్ఫాన్, డిసీఓ ప్రసాద రావు, డిసీఎస్ఓ కాశీ విశ్వనాధ్, డిఆర్డిఓ పీడీ ఉమాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, మార్కెటింగ్ అధికారి స్వరన్ సింగ్, సివిల్ సప్లై అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్ లు, ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా సభ్యులు, రైస్ మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.