రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు జగన్ కు లేవు: ప్రత్తిపాటి
- జగన్ కు తెలిసింది దురాలోచనలు.. విధ్వంసం..విషప్రచారమే.
- పదవులు పొందిన వారు, ప్రజలతో సేవా.. గౌరవభావాలతో వ్యవహరించి పార్టీ ప్రతిష్ఠ పెంచాలి.
- రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని కీలక పదవుల భర్తీపై పార్టీశ్రేణులు త్రిసభ్య కమిటీ ఎదుట వెల్లడించిన అభిప్రాయాలను అధిష్టానానికి తెలియచేస్తాం.
- పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన మాజీమంత్రి ప్రత్తిపాటి
రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సహా.. అనుబంధ సంఘాలు, ఇతర కీలక పదవుల భర్తీపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకోవడం జరిగిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పార్టీ అధినాయకత్వం నియమించిన త్రిసభ్య కమిటీలో సభ్యులైన మంత్రి కొలుసు పార్థసారథి, సీనియర్ శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, తాను నేడు స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో కీలక సమావేశం నిర్వహించామని, వినాయక చవితి తర్వాత పార్టీ అధిష్టానం తన నిర్ణయాలు వెలువరిస్తుందని ప్రత్తిపాటి స్పష్టంచేశారు.
రాజమహేంద్రవరం పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశానంతరం ప్రత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. 17 అనుబంధ సంఘాలు, 54 కులసంఘాలకు నూతననియామకాలు ఉంటాయన్నారు. పార్టీకోసం కష్టపడినవారికి న్యాయం చేస్తూ, పదవులకు వన్నెతెచ్చేవారిని, పార్టీ గౌరవం పెంచి, ప్రజలతో సేవాభావంతో వ్యవహరించి పార్టీ ప్రతిష్ఠ పెంచేవారికే పదవుల్లో తగిన ప్రాధాన్యత ఉంటుందని ప్రత్తిపాటి తెలిపారు.
ప్రభుత్వపథకాలపై ప్రజల్లో దురభిప్రాయం కలిగించాలన్నదే జగన్ ఆలోచన
జగన్ అధికారంలోకి వస్తూనే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే ప్రజావేదికను కూల్చేసి, విధ్వంసపాలనకు శ్రీకారం చుట్టాడు. తన అనాలోచిత విధానాలతో రాష్ట్రాన్ని కోలుకోలేనివిధంగా దెబ్బతీశాడు. ఇప్పుడేమో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై దుష్ప్రచారం చేస్తూ, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో దురభిప్రాయం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాడని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన వారిలో ఏ మాజీ ముఖ్యమంత్రి ప్రవర్తించని విధంగా జగన్ తీరు ఉందన్నారు. దురాలోచనలతో, విధ్వంసం, విషప్రచారం చేయాలనుకునే మాజీ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఉండరని, ఆయన ఆలోచనలన్నీ ప్రజావ్యతిరేకంగానే ఉంటాయని ప్రత్తిపాటి తెలిపారు. ఒక రాజకీయ నాయకుడికి, రాజకీయ పార్టీని నడిపించే వ్యక్తికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా జగన్ కు లేదని మాజీమంత్రి తేల్చిచెప్పారు.
మోదీ, పవన్ కల్యాణ్ లు చంద్రబాబుకు అండగా ఉండి రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తుంటే, జగన్..వైసీపీనేతలు నష్టం చేయడంపై ఆలోచిస్తున్నారు
చంద్రబాబుగారు తనకున్న విశ్వసనీయత.. అనుభవం.. దూరదృష్టి… పట్టుదలతో కేంద్రప్రభుత్వం, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహాయసహకారాలతో సూపర్ -6 ను విజయవంతంగా అమలుచేశారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. మోదీ, పవన్ కల్యాణ్ లు రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తుంటే, ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, వైసీపీనేతలు రాష్ట్రానికి, ప్రజలకు ఎలా నష్టం చేయాలా అని ఆలోచిస్తున్నారని, వారు ఇప్పటికైనా పిచ్చిమాటలు, విషప్రచారం కట్టిపెట్టి తమ పద్ధతి మార్చుకుంటే మంచిదని ప్రత్తిపాటి హితవుపలికారు. కూటమిప్రభుత్వంలో అవినీతికి స్థానం లేదని, అధికారులు.. ప్రజాప్రతినిధుల పనితీరును ముఖ్యమంత్రి ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రత్తిపాటి స్పష్టంచేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
