ఎన్‌టీపీసీ కార్మికుల పీఎఫ్‌, ఈఎస్ఐ బకాయిలు వెంటనే చెల్లించాలి…

Sakshitha news

ఎన్‌టీపీసీ కార్మికుల పీఎఫ్‌, ఈఎస్ఐ బకాయిలు వెంటనే చెల్లించాలి…

ఆరు నెలలుగా బకాయిలు జమ కావడం లేదు.. సమస్య పరిష్కరించకుంటే ఆందోళన…

–పారిశ్రామిక కార్మికుల సంఘం…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి: రామగుండం/ : ఎన్‌టీపీసీ ప్లాంట్‌లోని విద్యుత్ విభాగంలో రాఖీ ఎంటర్‌ప్రైజెస్ కాంట్రాక్టు పరిధిలో పనిచేస్తున్న 16 మంది లిఫ్టు కార్మికుల పీఎఫ్‌, ఈఎస్ఐ బకాయిలను గత ఆరు నెలలుగా వారి ఖాతాల్లో జమ చేయడం లేదని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ విభాగం సహాయ మహా ప్రబంధకుడికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు ఎండీ యాకూబ్, ప్రధాన కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సదరు కాంట్రాక్టు సంస్థ పరిధిలో పనిచేస్తున్న 16 మంది కార్మికులకు గత ఆరు నెలలుగా పీఎఫ్‌, ఈఎస్ఐ బకాయిలు జమ కావడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్ విభాగం సహాయ మహా ప్రబంధకుడి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

పీఎఫ్‌, ఈఎస్ఐ సొమ్ములు జమ కాకపోవడంతో అనారోగ్య సమయాల్లో కార్మికులు కనీస వైద్య సదుపాయాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాల నుంచి చట్టబద్ధంగా మినహాయించే సొమ్మును సంబంధిత ఖాతాల్లో సకాలంలో జమ చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టు సంస్థపై ఉందని అన్నారు.

రాఖీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ గత ఆరు నెలలుగా నిలిపివేసిన పీఎఫ్‌, ఈఎస్ఐ బకాయిలను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ విభాగం సహాయ మహా ప్రబంధకుడు ప్రత్యేక చొరవ తీసుకొని కార్మికులకు చట్టబద్ధమైన ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్మిక చట్టాలు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాంట్రాక్టు సంస్థపై విచారణ జరిపి, కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల యాజమాన్యం సానుకూలంగా స్పందించి, తక్షణమే బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సమస్యను పరిష్కరించని పక్షంలో కార్మికుల ప్రయోజనాల కోసం సంఘం ఆధ్వర్యంలో తదుపరి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని యూనియన్ నాయకులు హెచ్చరించారు.

Scroll to Top