ప్రజా సమస్యలపై వెంటనే కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి….

Sakshitha news

ప్రజా సమస్యలపై వెంటనే కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి….

ఆరు నెలలు గడిచినా రెండో సమావేశం ఏది?.. బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్ డిమాండ్…

సాక్షిత పెద్దపల్లి- రామగుండం: రామగుండం : నగరపాలక సంస్థ పరిధిలో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని, ప్రతి డివిజన్‌లో సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్ అన్నారు.

ప్రజల ఆమోదంతో ఎన్నికైన కార్పొరేటర్లుగా ఆయా డివిజన్లలోని సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. కార్పొరేటర్లు ఎన్నికై ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రెండో కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడంపై ఆయన ప్రశ్నించారు.

తక్షణమే కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ప్రతి డివిజన్‌లో నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాలని అన్నారు.

గత కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ప్రస్తావించిన సమస్యల్లో ఎన్ని పరిష్కరించారో, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో అధికారులు, పాలకవర్గం స్పష్టం చేయాలని కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా జాప్యం చేయడం సరికాదని అన్నారు.

రామగుండం ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని బీఆర్‌ఎస్ తరఫున కోరారు.

ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ తోకల శ్యామని రమేష్ పాల్గొన్నారు.