రైతులకు చేరువలో పెట్రోల్ బంక్… అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబాటు…

Sakshitha news

రైతులకు చేరువలో పెట్రోల్ బంక్… అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబాటు…

నీరుకులలో పెట్రోల్ & డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు…

….

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: సుల్తానాబాద్, రైతులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.

సుల్తానాబాద్ మండలం నీరుకుల గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సహకార వారోత్సవాల్లో భాగంగా నూతనంగా నిర్మించిన కన్స్యూమర్ ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ & డీజిల్ బంక్)ను ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలో సుమారు రూ.30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని 14 సహకార సంఘాల్లో 11 సంఘాలను ఏకం చేసి ఎలిగేడు మండల శివారులో 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విత్తన శుద్ధి కేంద్రంగా సుల్తానాబాద్ సొసైటీ ఎంపిక కావడం గర్వకారణమన్నారు.

గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7 వేల మెట్రిక్ టన్నుల గోదాములు మాత్రమే నిర్మించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 20 వేల మెట్రిక్ టన్నుల గోదాముల పనులు ప్రారంభించామని, మరో 14 వేల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మిస్తున్నామని తెలిపారు. రాబోయే రెండేళ్లలో నియోజకవర్గంలో లక్ష మెట్రిక్ టన్నులకుపైగా గోదాముల నిర్మాణం చేపట్టేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, గర్రెపల్లి–భూపతిపూర్ గ్రామాల వద్ద మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు.

నీరుకుల, కోమండ్లపల్లి, రంగంపల్లి, వేగురుపల్లి గ్రామాల ప్రజలకు ఈ పెట్రోల్ బంక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. గర్రెపల్లి నుంచి పెగడపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అలాగే నీరుకుల గ్రామానికి మానేరు వాగు తాగునీటిని రెండు నెలల్లో అందించేందుకు చర్యలు తీసుకుంటామని, గ్రామ ప్రజల చిరకాల కోరికైన బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమార్, ఏఎంసీ చైర్మన్ ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, డీసీవో శ్రీమాల, ఉపసర్పంచ్ సతీష్, సీఈవో బూర్గు సంతోష్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top