SAKSHITHA NEWS

ఇళ్లు లేని పేదలు అందరికీ ఐదేళ్లలో శాశ్వత గృహాలు
రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి

అమరావతి, అక్టోబరు 11: రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే మాట అనకుండా వచ్చే ఐదేళ్లలో నిరుపేదలు అందరికీ శాశ్వత గృహ వసతి కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్థేశం చేశారని, ఆ లక్ష్య సాధన దిశగా గృహనిర్మాణ శాఖ ముందుకు అడుగులు వేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాలా శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నాల్గోబ్లాక్ మొదటి అంతస్తులో ఆధునీకరించబడిన తన చాంబరులో శాస్త్రోత్తంగా శుక్రవారం ఆయన ప్రవేశించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనకు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్‌ కు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్కు మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదములు తెలిపారు. ప్రజలకు మేలు చేయడానికి, పాదర్శకంగా పాలన అందజేయడానికి తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఆ దిశలోనే రాష్ట్రంలోని నిరుపేదలు అందరికీ ఎంతో పారదర్శకంగా నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఎస్సీలకు, బీసీలకు మేమే చాంఫియన్లు అని చెప్పుకునే గత పాలకుల హయాంలో గృహ నిర్మాణ శాఖలో ఎన్నో అవకతవకలు జరిగాయని, నిరుపేదల గృహ నిర్మాణాలకై కేంద్రం ఇచ్చిన దాదాపు రూ.4,500 కోట్ల నిధులను ప్రక్కద్రోవ పట్టించి నిరుపేదలకు అన్యాయం చేయడం జరిగిందన్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క యూనిట్ కు రూ.2.50 లక్షల ఋణ సహాయాన్ని అందజేస్తే, దాన్ని రూ.1.80 లక్షలకు తగ్గించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీల గృహ నిర్మాణానికై రూ.50 వేల నుండి లక్ష రూపాయల వరకు అదనంగా అందజేసే ఆర్థిక సహాయాన్ని కూడా పూర్తిగా రద్దు చేసిన ఘనత గత ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలోనే కాకుండా, ఇంకా వారికి ఏ విధంగా మేలు చేకూర్చగలమో అనే కోణంలో ఆలోచించి ప్రతిపాదనలు రూపొందించాలని ఈ మధ్య జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా తగు చర్యలు చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో ఎన్నో తప్పిదాలు జరిగాయని, రాష్ట్రాన్ని రూ.10.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దింపడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్ధితికి రాష్ట్రాన్ని తీసుకు రావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎటు వంటి ఆదాయ వనరులు, అభివృద్ది లేకుండా చేయడం జరిగిందని, గతంలో జరిగిన ఇటు వంటి తప్పిదాలు అన్నింటనీ చక్కదిద్ది రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వ వంద రోజుల పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతగానో కృషిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని, అభివృద్దిని అందిపుచ్చుకునేలా యువతీ యువకులను సిధ్దం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ ద్వారా ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేయడం జరుగుచున్నదన్నారు. ప్రజలు కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా వారికి బంగారు భవిష్యత్తును ఏర్పాటుచేసే దిశగా కృషి జరుగుచున్నదని, 2029 నాటికి రాష్ట్ర జిడిపి, ప్రతి పౌరుడి తలసరి ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హమీని అన్నింటినీ దశల వారీగా అమలు చేయడం జరుగుచున్నదని, సామాజిక భద్రతా పింఛన్లను రూ.4 వేలకు పెంచి, మూడు నెలల బకాయిలను కలిపి రూ.7 వేలు చెల్లించండ జరిగిందన్నారు. రాష్ట్రానికి మంచి నాయకత్వం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మంచి ఫలితాలు చూపగలరు అనే విధంగా ఒకే రోజున 65 లక్షల మందికి పెన్షన్ ను ప్రభుత్వోద్యోగులు పంపిణీ చేశారన్నారు. గత ప్రభుత్వ బకాయిలతో మాకు సంబందం లేదు అని భావించ కుండా గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1600 కోట్ల ధాన్య కొనుగోలు బకాయిలను రైతులకు చెల్లించడం జరిగిందన్నారు. కేంద్రం మంచి ఉద్దేశంతో భూ హక్కుల చట్టాన్ని తేవాలని ఆలోచన చేస్తే ఆ చట్టంలో అన్ని తమకు నచ్చేలా నిబంధనలను మార్చుకుని దోపిడీకి రాచమార్గంవేస్తే, వారి దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేయడం జరిగిందన్నారు. విద్య అంటే భవనాలు నిర్మించడం, రంగులు దిద్దడమే కాదని, విద్యార్థులకు చక్కని చదువు, జ్ఞానం, విజ్ఞానం అందజేయాలనే లక్ష్యంతో 16,700 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించడం జరుగుచున్నదన్నారు. ఈ దీపావళి నుండి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెపుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రకటనలు జారీలో ఇష్టానుసారంగా ప్రవర్తించడమే కాకుండా తమకు నచ్చిన పేపర్లకు పెద్ద ఎత్తున జారీచేస్తూ, నచ్చని పేపర్లు వాటంతట అవే విత్ డ్రా అయ్యే పరిస్థితులు కల్పించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయంలో రూ.200/-లు పత్రిక కొనుగోలుకు ఇస్తూ అనధికారికంగా పలానా పత్రికనే కొనుగోలు చేయాలని నిర్థేశించినట్లు సమాచారం ఉందని, దానిపై విచారణ జరుగుతోందన్నారు. సంబంధిత జీవోను కూడా రద్దు చేయడం జరిగిందన్నారు.

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎం.డి. కె.రాజబాబు, సమాచార శాఖ అదనపు సంచాలకులు ఎల్.స్వర్ణలత, సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ తదితరులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు మంత్రి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.


SAKSHITHA NEWS