మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌ల కార్యాలయాల మార్పుపై ప్రజల అసంతృప్తి
కార్యాలయాల మార్పుతో దివ్యాంగులు, వృద్దులకు ఇబ్బందులు
కార్యాలయాలు గతంలో మాదిరి యధావిధిగా కొనసాగించాలంటున్న ప్రజలు
చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు చేరువగా ఉండి, వారి సమస్యలు పరిష్కారించాలని పదే పదే స్పష్టం చేస్తూనే ఉంది. కాని చిలకలూరిపేట మున్సిపాలిటీ తీరు మరోలా ఉంది. ప్రజలకు అందుబాటులో ప్రజా ప్రతినిధికి ఒకలా, కార్యాలయానికి, ప్రజలకు అందుబాటులో ఉండే అధికారికి మరోలా గదులు కేటాయించటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషయానికి వస్తే చిలకలూరిపేట మున్సిపాలిటీలో గతం నుంచి మున్సిపల్ చైర్మన్‌కు పై భాగాన ఉన్న గదిని, మున్సిపల్ కమిషనర్‌కు కింది భాగాన ఉన్న గదిని కార్యాలయాల నిమిత్తం కేటాయిస్తూ వచ్చారు. పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు అందుబాటు ఉండటానికి గతం నుంచి ఇదే తరహ ఏర్పాటు చేశారు.
కార్యాలయాల మార్పుతో ఉద్యోగులు, ప్రజల ఇక్కట్లు..
మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు కింది భాగాన ఉండటంతో వారితో నిత్య సమావేశం అవ్వడానికి, అధికారుల కార్యకలాపాలు పరిశీలించటానికి మున్సిపల్ కమిషనర్ కార్యాలయం కింది భాగంలో ఉండేలా నిర్ణయించారు. దీంతో దివ్యాంగులు, వృద్ధులు నేరుగా కమిషనర్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా కింద భాగంలోనే కమిషనర్ కార్యాలయం ఉంచేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో మున్సిపల్ చైర్మన్ తన ఆఫీసును కింద భాగాన్న ఉన్న మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోకి, పై భాగాన్న చైర్మన్ కార్యాలయానికి మార్పు చేశారు.
ఈ మార్పు జరిగి రెండు నెలలు గడుస్తున్నా మున్సిపల్ చైర్మన్ కేవలం మూడు, నాలుగు సార్లు మినహా కార్యాలయంలోకి అడుగు పెట్టిన దాఖలాలు లేవు. నిత్యం వివిధ సమస్యలపై కమిషనర్‌ను సంప్రదించే ప్రజలకు ఈ మార్పు ఇబ్బందిగా మారింది. దివ్యాంగులు, వృద్దులు పై అంతస్తుకు చేరుకోవడం కష్టంగా మారింది. దివ్యాంగులు వృద్ధులు పై అంతస్తు మెట్లు ఎక్కలేక గంటల తరబడి క్రిందనే కమిషనర్ కోసం వేచి ఉండవలసి వస్తుంది,
దీంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే అధికారికి పై గది కేటాయించటం మేమిటనని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు అత్యధిక అధికారులు కింది భాగంలో ఉండటంతో తరుచూ కమిషనర్‌ను కలవడానికి, వివిధ ఫైళ్లపై సంతకాలు చేయించుకోవడానికి, వివిధ సమస్యలపై చర్చంటానికి ఈ మార్పు ఇబ్బందిగా మారటంతో ఉద్యోగులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజలు, ఉద్యోగుల ఇబ్బందులు గుర్తించి గతంలో మాదిరి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ గదులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.