సాక్షిత : తిరుపతి ప్రజలకు, పుణ్యక్షేత్రానికి వస్తున్న యాత్రికులకు అనుకూలంగా వుండేలా నిర్మిస్తున్న మల్టి లెవల్ కార్ పార్కింగ్ ప్రాజెక్ట్ ను వేగవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ ముందర టి.పి. ఏరియాలో నిర్మిస్తున్న మల్టి లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణ పనులను కమిషనర్ హరిత పరిశీలించి అధికారులకు, నిర్మాణ సంస్థ కాంట్రాక్టర్లకు తగు సూచనలు చేసారు. ఈ సంధర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ 50 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో ఇక్కడ నిర్మిస్తున్న మల్టి లెవల్ కార్ పార్కింగ్ స్థలంలో సెల్లార్, జీ ప్లస్ 7 అంతస్థులతో మల్టి లెవల్ కార్ పార్కింగ్ నిర్మించడం జరుగుతుందన్నారు.
ఇందులో క్రిందనున్న సెల్లార్లో 160 ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకునేలా డిజైన్ చేయడం జరిగిందని, అదేవిధంగా 1, 2 అంతస్థుల్లో రెస్టారెంట్లు, కమర్షియల్ షాపులు వుంటాయని, 3,4 అంతస్థుల్లో మల్టి ప్లెక్స్ థీయేటర్లు వుంటాయని, 5,6,7 అంతస్థుల్లో 240 కార్లు పార్కింగ్ చేసుకునేలా, ఆ వాహనాలను పైకి తీసుకెల్లెందుకు 6 లిప్టులను నిర్మించడం జరుగుతుందన్నారు. తిరుపతి నగరంలోకి వచ్చే యాత్రీకులకు, ఇక్కడున్న ప్రజలకి ఈ మల్టి లెవల్ కార్ పార్కింగ్ రావడం వలన ఎంతో ఉపయోగకరంగ వుంటుందని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.