సంపద సృష్టిలో భాగమే… వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం : మాజీ మంత్రి పుల్లారావు.
హోమ్ ట్రయాంగిల్ & మెప్మా అందిస్తున్న స్వయంఉపాధి శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి – పుల్లారావు
సంపద సృష్టి విధానంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే పని చేయడం) విధానానికి శ్రీకారం చుట్టారని, దానిలో భాగంగానే హోమ్ ట్రయాంగిల్ సంస్థ, పట్టణ పేదరిక నిర్ములన సంస్థ (మెప్మా ) తో కలిసి ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆయన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మెప్మా – హోమ్ ట్రయాంగిల్ సంస్థ నిర్వహించిన మెప్మా బజార్ ను ప్రారంభించి పరిశీలించారు. అనంతరం నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కుటుంబ ఆదాయం పెంచాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు వాస్తవరూపం ఇచ్చేలా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలన్నారు.
పొదుపు సంఘాల్లోని మహిళలను భాగస్వాముల్ని చేస్తూ, హోమ్ ట్రయాంగిల్ సంస్థ చేపట్టిన అందరికీ పని కల్పించే ఈ వినూత్న విధానాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి సూచించారు. ఖర్చులకు తగినట్టు ప్రజల ఆదాయం పెరగాలన్నదే ప్రభత్వ ఆలోచన అన్నారు. హోమ్ ట్రయాంగిల్ సంస్థ మూడు నెలల పాటు కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, A/C, రిఫ్రీజీరేటర్ గీజర్ రిపేర్, బ్యూటీషియన్ విభాగాల్లో మహిళలు, యువతకు 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తోందన్నారు. శిక్షణ పూర్తి అయిన తరువాత ఒక్కొక్కరు వారి నైపుణ్యాన్ని బట్టి నెలకు రూ. 15 వేల నుంచి రూ. 35 వేల వరకు సంపాదించుకోవచ్చని పుల్లారావు చెప్పారు. చిలకలూరిపేట పట్టణంలో దాదాపు 84 వేల ఇళ్ళు ఉన్నాయని, ఇంటికి ఒకరికి చొప్పున ఉపాధి కల్పించేలా హోమ్ ట్రయాంగిల్ సంస్థ విశేష కృషి చేయాలని మాజీ మంత్రి స్పష్టంచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, మేప్మా సిబ్బంది, జనసేన ఇంచార్జి తోట రాజా రమేష్, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సామద్ ఖాన్, మద్దూమాల రవి, కౌన్సిలర్ లు, పార్టీ నాయకులు తదితరులున్నారు.