
మంత్రి నారా లోకేష్‌కి చేసిన ఒక్క మెసేజ్
ఒకరి అవయవ దానం..మరొకరికి ప్రాణదానం
- గుండె తరలించేందుకు సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం, గ్రీన్ ఛానల్ ఏర్పాటుచేసిన మంత్రి నారా లోకేష్
- బ్రెయిన్ డెడ్ అయిన మహిళ చెరుకూరి సుష్మ అవయవదానంతో తిరుపతిలో మరొకరికి ప్రాణదానం
- సకాలంలో స్పందించిన మంత్రి నారా లోకేష్‌కి కృతజ్ఞతలు తెలియజేసిన రమేష్ హాస్పిటల్స్, అవయవ దాత, స్వీకర్త కుటుంబాలు
- ఈ రోజు సాయంత్రం 7 గంటలకు గ్రీన్ ఛానెల్ ద్వారా గుండెను తరలించనున్న గుంటూరు రమేష్ ఆసుపత్రి సిబ్బంది.
మంత్రి నారా లోకేష్ సకాలంలో స్పందించే హృదయంతో.. ఒకరి అవయవ దానం, మరొకరికి ప్రాణదానం చేయనుంది. సొంత ఖర్చులతో గుండె తరలింపునకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడమే కాకుండా, గ్రీన్ ఛానల్‌కు మార్గం సుగమం చేసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఆయా కుటుంబ సభ్యులు, రమేష్ హాస్పటల్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.
గుంటూరు రమేష్ హాస్పిటల్స్ లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మ బ్రెయిన్ డెడ్ అయ్యారు. జీవచ్ఛవంలా మారిన తమ ఇంటి వెలుగు సుష్మ మరణం సజీవం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆమె అవయవదానానికి అంగీకరించారు. వెంటనే రమేష్ హాస్పిటల్స్ గుంటూరు వైద్యులు ఆగమేఘాలపై అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేష్ కు ఒక్క మెసేజ్ పంపారు. క్షణాల్లో స్పందించిన మంత్రి గుండె తరలింపునకు అవసరమైన ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు, తిరుపతి ఆస్పత్రికి గుండె చేరేవరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు. అసాధ్యం అనుకున్న పని ప్రత్యేక విమానం సొంత ఖర్చుతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేయడంతో సుసాధ్యం కావడంతో గుండె మార్పిడి విజయవంతం చేసేందుకు వైద్యులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకున్నారు.
