ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ లు, హెల్పర్ ల వేతనాలు పెంచాలి
రెండవ రోజు సమ్మెలో హెచ్ పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ లు, హెల్పర్ లు
నిలిచిపోయిన హెచ్ పి పెట్రోల్, డీజిల్ రవాణా
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : హెచ్ పిసిఎల్ ఇమాంపేట వద్ద పనిచేసే ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ లు, హెల్పర్ ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆయిల్ ట్యాంకర్ ల డ్రైవర్ లు, హెల్పర్ లు చేస్తున్న సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. కార్మికులు హెచ్ పిసిఎల్ వద్ద సమ్మెకు దిగడంతో పెట్రోల్, డీజిల్ రవాణా నిలిచిపోయింది. ఈ సమ్మెలో ఎఐటియుసి అనుబంధ సంస్ధ హెచ్ పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్స్ డ్రైవర్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండిబాబా, ప్రధాన కార్యదర్శి నిమ్మల ప్రభాకర్ లు మాట్లాడుతూ ఆయిల్ ట్యాంకర్ ల డ్రైవర్ లకు రోజుకు 1000/- మరియు హెల్పర్ లకు రోజుకు 700/- వేతనం ఇవ్వాలని తాము యాజమాన్యాన్ని కోరితే అందుకు ఒప్పుకోలేదని, హెచ్ పిసిఎల్ అధికారులు ఆయిల్ ట్యాంకర్ ల యజమానులు కలిసి కార్మికులను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
యూనియన్ లో పనిచేసే కార్మికులను తొలగిస్తామని యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతుందని అన్నారు. తాము రెండున్నర సంవత్సరాల తరువాత వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తే ట్యాంకర్ ల యజమానులు అంగీకరించక పోవడం వలన తాము సమ్మె చేస్తున్నామని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు పెరిగి కార్మికులు ఆర్దిక పరమైన ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. తమ డిమాండ్ లు నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి పిడమర్తి నాగరాజు, ఉపాధ్యక్షులు వెంకట నారాయణ, గౌరవ అధ్యక్షులు రాచకొండ సాయిబాబా, రాములు, నగేష్, లింగయ్య, ఉపేందర్, సైదులు, వెంకన్న, హలీం, బాబు, శివరాజు, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.