ఇన్చార్జి అధికారులు వార్డుల్లో పర్యటించండి
** మున్సిపల్ కమిషనర్ మౌర్య ఆదేశం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరంలోని అన్ని మురుగునీటి కాలువల్లో చెత్త చెదారం పేరుకు పోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ఆయా వార్డుల ఇన్చార్జి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతుల పరిష్కారంలో భాగంగా 18వ వార్డులోని మారుతినగర్, న్యూ మారుతి నగర్, అమరావతి నగర్ తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి పరసారత్నం, అధికారులతో కలసి కమిషనర్ పర్యటించారు. ఏమ్మా మీ ఇంటికి చెత్త వాహనం వస్తోందా? మురుగునీటి కాలువలు శుభ్రం చేస్తున్నారా? దుకాణాల్లో ప్లాస్టిక్ వినియోగిస్తున్నారా అని పరిశీలించారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ మురుగునీటి కాలువల్లో ప్రజలు చెత్త వేయరాదని తెలిపారు.
కాలువల్లో చెత్త వేయడం వలన పేరుకుపోయి నీరు రోడ్లపైకి వచ్చి అపరిశుభ్రంగా ఉంటుందని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లోని మురుగు నీటి కాలువల్లో చెత్త చెదారం పెట్టుకుపోకుండా శుభ్రం చేయాలని కోరారు. రోడ్లపైన ఏర్పడిన గుంతలను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో ప్రజలకు అవసరమైన సి.సి. రోడ్లు, డ్రైనేజీ కాలువల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. దోమలు ప్రబలకుండా ప్రతిరోజు ఫాగింగ్ చేయాలని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మునిసిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.లు మహేష్, మధు, ఎలక్ట్రికల్ డీఈఈ శిల్ప, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
