జిల్లా కలెక్టర్ కృషి స్ఫూర్తిదాయకం
** చంద్రగిరి జనసేన ఇన్ చార్జి దేవర మనోహర్
సాక్షిత ప్రతినిధి – చంద్రగిరి: తిరుపతి జిల్లా అభివృద్ధి దిశగా కృషి చేస్తూ ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడంలో ముందుండి పనిచేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు అందుకోవడం జిల్లాకు స్ఫూర్తిదాయకమని చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ దేవర మనోహర్ అన్నారు. కలెక్టరేట్ లో మర్యాద పూర్వకంగా కలిసి కలెక్టర్ వెంకటేశ్వర్ ను దుశాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దేవర మనోహర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం కింద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత ఊరైన నారావారిపల్లెతో పాటు ఎ.రంగంపేట, కందులవారిపల్లి, చిన్నరామాపురం గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, కేవలం కొద్ది కాలంలోనే 1600 ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిపాలనా నైపుణ్యాన్ని చాటారని ఆయన పేర్కొన్నారు.
అధికారులను సమర్థవంతంగా నడిపిస్తూ, నూతన సాంకేతికతను వినియోగించి, ప్రజలతో నేరుగా మమేకమవుతూ సమస్యలను పరిష్కరించడంలో కలెక్టర్ వెంకటేశ్వర్ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు.
ఇక ఏళ్ల తరబడి పరిష్కారం లభించని శెట్టిపల్లి భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపడం, పలు అభివృద్ధి ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయించడం, గ్రామీణాభివృద్ధి పథకాలకు గణనీయమైన ప్రోత్సాహం ఇవ్వడం వంటి కార్యక్రమాలతో తిరుపతి జిల్లా పరిపాలనలో కొత్త చరిత్ర సృష్టించారని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజల సమస్యలకు న్యాయం చేయడంలో ముందు వరుసలో ఉండే కలెక్టర్ వెంకటేశ్వర్ స్కోచ్ అవార్డు అందుకోవడం తిరుపతి ప్రజలకు గర్వ కారణం. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను”
అని దేవర మనోహర్ పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
