డ్రోన్ నిఘాతో ప్రతి మూలలో పర్యవేక్షణ

Sakshitha news

డ్రోన్ నిఘాతో ప్రతి మూలలో పర్యవేక్షణ

** తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడి

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: డ్రోన్ కెమెరా పర్యవేక్షణలో మత్తు ఇంజక్షన్లు వేసుకుంటున్న ముగ్గురు పట్టుబడ్డారని… డ్రోన్ నిఘాతో ప్రతి మూలలో కూడా పర్యవేక్షణ పెంచుతామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు వెల్లడించారు. డ్రగ్స్‌కి “నో ” – జీవితానికి “ఎస్ ” చెప్పండి అంటూ ఎస్పీ అవగాహన కల్పించారు.
మత్తు వైపు అడుగు వేస్తే — జైలు తలుపులు ఎదురవుతాయి అన్నారు. జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, వ్యసనాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు.
ఈ క్రమంలో తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్సీ గేట్ రైల్వే ట్రాక్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు మత్తు ఇంజక్షన్లు వేసుకుంటున్నట్లు డ్రోన్ పర్యవేక్షణ ద్వారా గుర్తించారు. తక్షణమే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇచ్చి విచారణ చేపట్టారు.
తిరుపతి పోలీసుల ఈ సమయస్ఫూర్తి చర్యతో, మత్తు పదార్థాల వినియోగంపై మరోసారి గట్టి హెచ్చరిక అందింది. యువత మత్తు వైపు అడుగు వేస్తే జైలు తలుపులు తప్పవు! మత్తు పదార్థాల వినియోగం భవిష్యత్తును చీకటిలోకి నెడుతుంది. ఎవరు ఇటువంటి వ్యసనాలకు లేదా అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా, వారిపై కఠినమైన… చట్టపరమైన చర్యలు తప్పవు అనీ అన్నారు. జిల్లా పోలీసులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ తమ పిల్లల ప్రవర్తన, స్నేహ వర్గాలను గమనించి, మత్తు, వ్యసనాల నుండి దూరంగా ఉంచాలని సూచించారు.
యువత తమ జీవితాన్ని సానుకూల దిశగా మలుచుకొని, మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మత్తు పదార్థాల వినియోగం లేదా విక్రయం గమనించిన వెంటనే డయల్ 112 కి సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.