ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి…
వేతనాల ఆలస్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు…
ఐడి యాక్ట్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి…
–నాంసాని శంకర్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం,
రామగుండం ఎన్టీపీసీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఐడి యాక్ట్–1948 నిబంధనల ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలని రామగుండం ఏరియా ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాంసాని శంకర్ డిమాండ్ చేశారు.
వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యం కారణంగా కార్మికులు కుటుంబ పోషణ, పిల్లల విద్య, అద్దెలు, వైద్య ఖర్చులు వంటి అవసరాలను తీర్చడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్టీపీసీ పరిధిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐడి యాక్ట్–1948 ప్రకారం ప్రతి నెల 26వ తేదీ నుంచి మరుసటి నెల 25వ తేదీ వరకు పనిచేసిన కార్మికులకు వచ్చే నెల 1వ తేదీలోపు వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లపై ఉందన్నారు. అలాగే నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పనిచేసిన కార్మికులకు మరుసటి నెల 7వ తేదీలోపు జీతాలు చెల్లించాలని చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు.
అయితే కొన్ని కాంట్రాక్టు సంస్థలు కార్మికులకు వేతనాలు ఆలస్యంగా చెల్లించడం వల్ల వారు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. కార్మికుల శ్రమకు తగిన గౌరవం ఇవ్వాలంటే ముందుగా వారికి సమయానికి వేతనాలు అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్టీపీసీ యాజమాన్యం వెంటనే స్పందించి ఐడి యాక్ట్ నిబంధనలను అమలు చేసేలా అన్ని కాంట్రాక్టర్లకు స్పష్టమైన సర్క్యులర్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వేతనాల చెల్లింపుపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించి, నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం యూనియన్ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని, కార్మికుల హక్కుల పరిరక్షణలో రాజీ పడబోమని నాంసాని శంకర్ స్పష్టం చేశారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
