ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు… విచారణకు ముందు మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు.
పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానన్న చిరుమర్తి లింగయ్య
రాజకీయ కుట్రలో భాగంగానే నోటీసులు ఇచ్చారని ఆరోపణ
జిల్లాలో పని చేసిన పోలీసులతో, పోస్టింగ్ కోసం మాట్లాడి ఉండవచ్చునని వ్యాఖ్య
ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు రావడంపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పందించారు. తనకు నోటీసులు ఇచ్చారని, విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. తాను విచారణను ఎదుర్కొంటానని… పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చినట్లుగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందునే తనకు నోటీసులు వచ్చాయన్నారు. ఈ నోటీసులపై న్యాయపోరాటం కూడా చేస్తానన్నారు.
తాను జిల్లాలో పని చేసిన పోలీసు అధికారులతో మాట్లాడి ఉండవచ్చునని… అలాగే పోలీసు అధికారుల పోస్టింగుల కోసం, కార్యకర్తల అవసరాల కోసం మాట్లాడటం సహజమేనన్నారు. కాగా, ఈరోజు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన నార్కట్‌పల్లి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయనను విచారించనున్నారు.