SAKSHITHA NEWS

మూసీ పరీవాహక ప్రాంతంలో ఎవరూ భయపడవద్దు… అండగా ఉంటాను: మధుయాష్కీ

చైతన్యపురి, కొత్తపేట, నాగోల్ ప్రాంతంలో మూసీ విశాలంగా ఉంటుందన్న యాష్కీ

ఇళ్లు లేని వాపు ఎక్కువగా భూసేకరణ చేసే విధంగా మాట్లాడుతానని హామీ
ప్రజలతో చర్చించకుండా ఇళ్లు కూల్చేది లేదన్న మధుయాష్కీ

మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు తాను అండగా ఉంటానని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ హామీ ఇచ్చారు.

చైతన్యపురి డివిజన్‌ ఫణిగిరి కాలనీలోని సాయిబాబా గుడి వద్ద మూసీ పరీవాహక ప్రాంతవాసులతో ఆయన సమావేశమయ్యారు. హైడ్రా కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లు కూలిస్తే తాము ఎక్కడ ఉండాలని ఆవేదన చెందారు. ఆయనకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా యాష్కీ మాట్లాడుతూ… ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణలో భాగంగా నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచిస్తోందన్నారు. హైదరాబాద్ లోపల మూసీ వేరని, చైతన్యపురి, కొత్తపేట, నాగోల్ లాంటి శివారు ప్రాంతాల్లో వేరు అన్నారు. హైదరాబాద్‌లో మూసీ తక్కువ వెడల్పుతో ఉంటుందని, చైతన్యపురి, కొత్తపేట, నాగోల్‌ ప్రాంతాలలో చాలా విశాలంగా ఉంటుందన్నారు.

పరీవాహక ప్రాంతంలో ఇళ్లులేని వైపు ఎక్కువగా భూసేకరణ చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడుతానని, తద్వారా ఇళ్లు కోల్పోకుండా ప్రయత్నం చేస్తానన్నారు. ప్రజల అనుమానాలు, భయాలను తీర్చడానికి స్వయంగా తానే సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వద్దకు నిర్వాసితులను తీసుకెళ్లి మాట్లాడుతానన్నారు. ప్రజలతో చర్చించకుండా ఎవరి ఇళ్లను కూల్చేది లేదన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు చెరువులు, కుంటలను మింగేశారని ఆరోపించారు. చెరువులను ఆక్రమించిన వారిపై విచారణ జరిపించడం ఖాయమన్నారు.


SAKSHITHA NEWS