వేలాడే విద్యుత్ తీగలతో ప్రమాదం వద్దు.. వెంటనే సరిచేయాలి….
ఏడో డివిజన్‌లో వార్డు పర్యటనలో విద్యుత్ శాఖ అధికారులకు మేయర్ ఆదేశం….
–మేయర్ మహంకాళి స్వామి….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/
విద్యుత్ ప్రమాదాల నివారణకు చేతికి అందేంత ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలను తక్షణమే సరిచేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా గురువారం ఏడో డివిజన్‌లోని జీఎం కాలనీలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), మున్సిపల్ కమిషనర్ (ఎఫ్‌ఏసీ) జె. అరుణ శ్రీ, స్థానిక కార్పొరేటర్ వేగొళపు రమాదేవి శ్రీనివాస్‌తో కలిసి మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు వర్షాకాలంలో చేతికి అందేంత ఎత్తులో విద్యుత్ తీగలు ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై వెంటనే స్పందించిన మేయర్ సంబంధిత విద్యుత్ శాఖ అధికారితో ఫోన్‌లో మాట్లాడి అత్యవసరంగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే నగరపాలక సంస్థ వీధి దీపాల నిర్వహణ సిబ్బంది సహకారం కూడా అందిస్తామని తెలిపారు.
గత మూడు నెలలుగా ముందస్తు ప్రణాళికతో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ద్వారా ప్రధాన కాలువల్లో పూడిక తొలగించడంతో భారీ వర్షాలు కురిసినా నగరంలో వరద ముప్పు చాలా వరకు తగ్గిందన్నారు. అయితే సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థలు ముందస్తు హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్ల వాటి పరిసర ప్రాంతాల్లో నీటి ముంపు ఏర్పడిందని విమర్శించారు.
ఎమ్మెల్యే సహకారంతో నిధులు సమీకరించి అన్ని ప్రాంతాల్లో వర్షపు నీటి కాలువల నిర్మాణం చేపట్టి భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏడో డివిజన్‌లో రోడ్లు, కాలువల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ మాట్లాడుతూ వార్డు పర్యటనలో గుర్తించిన అన్ని సమస్యలను నమోదు చేసి దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్ శాంతి స్వరూప్, పట్టణ ప్రణాళికాధికారి నవీన్, సహాయ ఇంజనీర్లు అన్వేష్, మనోజ్, నరేష్, పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.


