SAKSHITHA NEWS

కేంద్ర‌మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఎన్డీయే ఎంపిల సమావేశానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) హాజరు

ఢిల్లీ: కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఎన్డీయే ఎంపిల స‌మావేశంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ పాల్గొన్నారు. ఎన్డీయే ప్ర‌భుత్వం ఎన్డీయే కూట‌మిలోని పార్ల‌మెంట్ స‌భ్యుల‌ నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌స్య‌లు, కేంద్ర ప‌థ‌కాల అమ‌లు, నిధుల అవ‌స‌రాల‌ గురించి తెలుసుకునేందుకు కేంద్ర‌మంత్రుల‌కు కొంత‌మంది ఎంపిల‌ను గ్రూపులుగా అప్ప‌గించి ప్ర‌తి మూడు నెల‌ల‌కొక‌సారి స‌మావేశం కావాల‌ని ఆదేశించింది. కేంద్ర‌మంత్రి హార్టీప్ సింగ్ కి అధ్య‌క్ష‌త‌న వున్న ఎన్డీయే ఎంపిల గ్రూపులో ఎపికి చెందిన కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎంపి బస్తిపాటి నాగరాజు పంచలింగాల వున్నారు.

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అధ్య‌క్ష‌త‌న మంగ‌ళవారం రాత్రి ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో ప‌లువురు ఎన్డీయే ఎంపిల‌తో డిన్నర్ మీటింగ్ జ‌రిగింది. ఈ స‌మావేశానికి కేంద్ర ర‌క్షణ శాఖ మంత్రి రాజ‌నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో కేంద్ర‌ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ఏరోస్పెస్, డిఫెన్స్ పారిశ్రామిక రంగాలు వ‌చ్చే విధంగా స‌హ‌క‌రించాల‌ని కోర‌గా, ఆయ‌న సానుకూలంగా స్పందించారు. అలాగే కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరి కి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టాల్సిన‌ అభివృద్ది గురించి వివ‌రించారు.

కేంద్ర‌మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరి, కేంద్ర‌ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ త‌మ‌కి పార్ల‌మెంట్ లో కొన‌సాగాల్సి విధానం, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్దికి సంబంధించి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చిన‌ట్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఈ మేర‌కు విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అలాగే
కేంద్ర‌మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి, ఐక్యరాజ్యసమితి మాజీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్దేశ్వర్ పూరి దంప‌తులు ఇచ్చిన విందు ఆత్మీయ‌మైన అతిథ్యం మరుపురాని విధంగా వున్నాయ‌ని కొనియాడారు. హ‌ర్దీప్ సింగ్ పురి స‌తీమ‌ణి లక్ష్మీ ముర్దేశ్వర్ పూరి సౌతిండియా వంట‌కాలు ద‌గ్గ‌ర వుండి త‌యారు చేయించినంద‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ సమావేశంలో ఢిల్లీ రాష్ట్రానికి చెందిన ఎంపి వి సతీష్(బిజెపి), గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన‌ ఎంపి భరత్‌సిన్హ్ దాభి ఠాకూర్(బిజెపి), క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన ఎంపి బి వై రాఘవేంద్ర(బిజెపి),ఎంపి ఎమ్.మ‌ల్లేష్ బాబు (జె.డి.యు), మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపి డాక్టర్ రాజేష్ మిశ్రా (బిజెపి), ఓడిషా రాష్ట్రానికి చెందిన సంగీతా కుమారి సింగ్ డియో (బిజెపి), రాజ్య స‌భ ఎంపి మమతా మొహంతా (బిజెపి) , ఉత్త‌ర ప్ర‌దేశ్ కి చెందిన రాజ్య‌స‌భ‌ ఎంపి డాక్టర్ దినేష్ శర్మ (బిజెపి), వెస్ట్ బెంగాల్ కి చెందిన ఎంపి సమిక్ భట్టాచార్య (బిజెపి), బిహార్ కి చెందిన ఎంపి విజయ లక్ష్మి కుష్వాహ (జె.డి(యు)), ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి చెందిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (టిడిపి), ఎంపి బస్తిపాటి నాగరాజు పంచలింగాల (టిడిపి), అస్సాంకి చెందిన రాజ్య‌స‌భ ఎంపి రంగ్వ్రా నార్జారీ (యు.పి.పి.ఎల్) పాల్గొన్నారు.