నా మొదటి చిత్రం “మాతృదేవోభవ”
కావడం నాకు గర్వకారణం!!
- డెబ్యూ డైరెక్టర్ కె.హరనాథ్ రెడ్డి
ప్రి ప్రొడక్షన్ పనుల్లో రెండో చిత్రం
కోడి రామకృష్ణ, రేలంగి నరసంహారావు, ఇవివి సత్యనారాయణ వంటి దిగ్గజాల వద్ద దర్శకత్వ శాఖలో సుదీర్ఘకాలం పని చేసిన కె.హరనాథ్ రెడ్డి "మాతృదేవోభవ" (ఓ అమ్మ కథ) చిత్రంతో దర్శకుడిగా పరిచయమై... తొలి ప్రయత్నంలోనే తన ప్రతిభను ఘనంగా నిరూపించుకున్నారు. శ్రీవాసవి మూవీస్ పతాకంపై ఎమ్.ఎస్.రెడ్డి సమర్పణలో చోడవరపు వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ నటీమణి సుధ తన కెరీర్ లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, పోసాని, పతంజలి శ్రీనివాస్, శ్రీహర్ష, అమృతా చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు.
విడుదలైన అన్ని కేంద్రాల్లో అసాధారణ స్పందన అందుకున్న సందర్భంగా చిత్ర దర్శకుడు కె.హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ... "మాతృదేవభవ" సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చమర్చిన కళ్లతో మెచ్చుకున్నారు. సందేశానికి వినోదం జోడించి అద్భుతంగా తీశావని అభినందించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో సుధ గారి నటనకు అవార్డ్స్ రావడం ఖాయమని ముక్త కంఠంతో చెబుతుంటే చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది. క్యాన్సర్ సోకిన తనను... పిల్లలు కూడబలుక్కుని ఇంట్లోంచి గెంటేయాలని కుతంత్రాలు పన్నుతుండడం విని... తనే బయటకు వచ్చేసే సన్నివేశంలో సుధ నటన అందరితో కంట తడి పెట్టించింది. ఇంత మంచి చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడం నాకు చాలా గర్వంగా ఉంది. నా తదుపరి చిత్రం ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఔట్ అండ్ ఔట్ యూత్ ఎంటర్టైనర్ గా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో అద్భుతమైన కథ తయారు చేశాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి చేస్తాం" అన్నారు!!