రూ. 50లక్షలతో మున్సిపల్ పనులు ప్రారంభం
** ఎమ్మెల్యే జంగాలపల్లి, కమిషనర్ మౌర్యలచే
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సుమారు రూ.50లక్షలతో చేపట్టి పూర్తి చేసిన పనులను ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, కమిషనర్ నారపురెడ్డి మౌర్య శుక్రవారం ప్రారంభం చేశారు.
ప్రతి డివిజన్ లోనూ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక 35 వ వార్డు భవాని నగర్ లో సుమారు 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సిసి రోడ్డు, భూగర్భ డ్రైనేజీ కాలువలను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో
రాష్ట్ర బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ చైర్ పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ఆర్. సి. మునికృష్ణ, ముద్ర నారాయణ, తాతయ్య గుంట గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పలు డివిజన్లలో ఇప్పటికె రోడ్లు వేయడం జరిగిందని, మళ్ళీ 50 లక్షల రూపాయలు వెచ్చించి రోడ్లు, భూగర్భ డ్రైనేజి కాలువలు భవానీ నగర్ లో నిర్మించడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా 50 కోట్ల నిధులతో నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులను వేగంగా చేస్తున్నామని ఆయన తెలిపారు. రోడ్లు, మురుగునీటి కాలువల పూర్తి, విద్యుత్ దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని వార్డుల్లో ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి 30కోట్లతో చేపట్టిన పనులు త్వరలోనే పూర్తి కానున్నట్లు తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి సూచనల మేరకు నగరంలో ప్రజలకు అవసరమైన రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు డిపిఆర్ సిద్ధం చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రభుత్వ నిధులు రాగానే ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. టిటిడి పరిపాలన భవనం పక్కన ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందిగా మారినట్లు ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ చెప్పారు. వాహన యజమానులు వారంతట వారే వాహనాలను తీసేయాలని లేకుంటే పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, ఇంజినీర్ గోమతి, డిఈ. ప్రసాద్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
