SAKSHITHA NEWS

మోదీని తనకు మిత్రుడు మాత్రమే కాదని.. మంచి మనిషి అంటూ పొగడ్తల వర్షం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీని తనకు మిత్రుడు మాత్రమే కాదని.. మంచి మనిషి అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ట్రంప్.. ప్రపంచ దేశాల అధినేతల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మన ప్రధాని గురించి స్పందిస్తూ.. ఆయన కీర్తిని కొనియాడారు. నరేంద్ర మోదీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందు.. ఆ తర్వాత పరిస్థితి గురించి వివరించారు. ఈ క్రమంలోనే మోదీ సాధించిన ఘనతలను గుర్తు చేస్తూ.. ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ క్రమంలోనే 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికాలో నిర్వహించిన హౌడీ మోదీ కార్యక్రమం గురించి ట్రంప్ ప్రస్తావించారు. అమెరికాలోని టెక్సాస్‌లో 2019 సెప్టెంబరులో నిర్వహించిన హౌడీ మోదీ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని.. పేర్కొన్న ట్రంప్‌.. ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఇక ఆ హౌడీ మోదీ కార్యక్రమానికి దాదాపు 80 వేల మంది వచ్చినట్లు తెలిపారు. ఆ హౌడీ మోదీ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగినట్లు వెల్లడించారు. ఇక భారత ప్రధాని మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్‌ వివరించారు.

ఈ సందర్భంగా భారత్‌-పాక్ ఉద్రిక్తతలకు సంబంధించి గతంలో నరేంద్ర మోదీతో తాను జరిపిన ఓ సంభాషణను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గుర్తు చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో భారత్‌ను బెదిరించేందుకు ఓ దేశం ప్రయత్నాలు చేసిందని.. అలాంటి వ్యవహారాలను చక్కబెట్టడంలో తాను ఆరితేరానని.. ఆ విషయంలో సాయం చేస్తానని తాను మోదీకి మాట ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. దానికి మోదీ చాలా దూకుడుగా స్పందించారని.. ఆ వ్యవహారాన్ని తాను చూసుకోగలనని చెప్పినట్లు తెలిపారు. అవసరమైతే ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా సిద్ధమేనని చెప్పినట్లు పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి వారిని ఓడించామని మోదీ అన్నారని.. అది విని తాను ఆశ్చర్యానికి గురయ్యానని ట్రంప్‌ గుర్తు చేసుకున్నారు.


SAKSHITHA NEWS