కాళేశ్వరం అంశంపై పూర్తి విచారణకు సిద్ధం : ఎమ్మెల్యే వేముల వీరేశం

సాక్షిత నల్గొండ: నకిరేకల్ నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నియామకాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచే వ్యతిరేకిస్తోందని విమర్శించారు. తమ అవినీతి బయటపడుతుందనే భయంతోనే కోర్టును ఆశ్రయించారని, కొంతమేర స్టే తీసుకుని కేసు మొత్తం గెలిచినట్లుగా ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు.
హైకోర్టు కొన్ని అంశాలపై చర్యలు తీసుకోవద్దని మాత్రమే సూచించిందని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో నాణ్యత లోపాలు, నిర్మాణ లోపాల కారణంగా భారీ నష్టం జరిగిందని, వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందని ఆరోపించారు.
ఈ పరిస్థితికి బాధ్యులైన వారే ఇప్పుడు కోర్టుల్లో స్టేలు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ అవసరమని, అవసరమైతే సీబీఐ దర్యాప్తు కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఈ కేసులో ఎవరైనా తప్పు చేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ నేతలు “ఏటీఎంలా” ఉపయోగించుకున్నారన్న అభిప్రాయంపై ప్రజలే నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ అహంకారంగా వ్యవహరించడం సమంజసం కాదని విమర్శించారు. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు వారికి గుణపాఠంగా మారాల్సి ఉన్నప్పటికీ మార్పు కనిపించడం లేదన్నారు. కమిషన్ల కోసం, స్వప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించి ప్రజల సొమ్మును దోచుకున్నారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు. ఈ అంశంపై పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే వరకు ప్రభుత్వ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY