తీవ్ర ఎండల్లో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమంపై చర్యలు తీసుకోవాలి…
-ఎఐటీయూసీ డిమాండ్…
…..

సాక్షిత పెద్దపల్లి// రామగుండం, ఎన్టీపీసీ రామగుండం, తెలంగాణ ఎన్టీపీసీ ప్లాంట్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఎఐటీయూసీ అనుబంధ రామగుండం ఏరియా ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్షుడు రెడ్డపాక లక్ష్మణ్, కార్యదర్శి నాంసాని శంకర్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ఆర్ & టి మానవ వనరుల విభాగాధిపతి (హెచ్‌ఓడీ) సాగర్ రంజన్ సాహూ ని మర్యాదపూర్వకంగా కలిసి కార్మికుల సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు. అదనంగా యూనియన్ నూతన కమిటీ ప్రతులను కూడా అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామగుండం, తెలంగాణ, కుందనపల్లి ప్రాంతాలతో పాటు 10 మెగావాట్లు, 100 మెగావాట్లు, 175 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో వివిధ ప్రాంతాల్లో దాదాపు 6,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్మికులు ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుండి 52 డిగ్రీల వరకు పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రతి పనిస్థలంలో విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, ఎయిర్ కూలర్లు, చల్లని తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రతి కార్మికుడికి ఒక నీటి సీసా అందించడంతో పాటు ప్రతిరోజూ ఓఆర్‌ఎస్ ప్యాకెట్, మజ్జిగ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే కొన్ని ప్రాంతాల్లో రహదారులు, వీధి దీపాల ఏర్పాటుపై కూడా దృష్టి సారించాలని అధికారులను కోరారు. ఈ సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో టి. సత్యనారాయణ, బి. అర్జున్, పి. శివపాల్ సింగ్, ఏ. రాజేందర్ రెడ్డి, జి. మహేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY