పట్టణ ప్రగతే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం మేయర్ మహంకాళి స్వామి….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని,
పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ మహంకాళి స్వామి 4వ డివిజన్లో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. స్థానిక కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజుతో కలిసి డివిజన్లోని కాలనీలు, ప్రధాన రహదారులను సందర్శించి పారిశుధ్య పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మేయర్, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
డివిజన్లో రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేయించారు. రహదారులకు అడ్డుగా ఉన్న రేకులు, ఇతర అడ్డంకులను తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఖాళీ స్థలాల్లో పెరిగిన చెట్ల పొదలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. పట్టణ ప్రగతి ప్రణాళిక కింద ప్రజలకు మెరుగైన పారిశుధ్య వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిశుభ్రతను కాపాడాలని, నగర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిష్కరించి, అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అధికారులు, పారిశుధ్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
