ఆర్థికవేత్తగా దేశానికి మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి ఎంపి కేశినేని శివనాథ్ నివాళి
ఢిల్లీ : ప్రధానమంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ గానే కాకుండా ఆర్థికవేత్తగా దేశానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ అందించిన బహుముఖ సేవలు చిరస్మరణీయం. దేశానికి మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటు అని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన పార్థివదేహానికి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, సహచర ఎంపిలతో కలిసి ఎంపి కేశినేని నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. మన్మోహన్ సతీమణి గురుశరణ్ కౌర్ తో పాటు కుటుంబ సభ్యులకు ఎంపి కేశినేని శివనాథ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్థరణలకు పెద్ద పీట వేయటంతో పాటు దేశంలో పలు రంగాల్లో కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దిగ్బ్రాంతి కలిగించిందని అన్నారు. దేశంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో మన్మోహన్ సింగ్ ఒకరని కొనియాడారు. , దేశం గొప్ప దార్శనికుడ్ని కోల్పోయిందని పేర్కొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గా భారతదేశ ఆర్ధిక వ్యవస్థ పురోభివృద్దికి విశేషమైన కృషి చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందారన్నారు.. మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన ఎనలేని సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని తెలిపారు.. డాక్టర్ మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించటంతోపాటు , శోకతప్తులైన మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని ఆ భగవంతుడ్ని వేడుకున్నట్లు వెల్లడించారు.